Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్‌రెడ్డిపై కోపంతో ఇరువురు ఒకటయ్యారా
- దామన్నతో స్నేహ హస్తం చాచిన కోమటిరెడ్డి..?
- ఇద్దరి కలయిక పార్టీలో ఎటు దారితీస్తుందో!
నవతెలంగాణ-సూర్యాపేట
కొన్ని దశాబ్దాలుగా వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేపరిస్థితి ఉండేది.ఒకరికొకరు వర్గ విబేధాలతో నిత్యం రగిలి పోయే వారు.నియోజకవర్గంలో అడుగు పెడితే ఆ రోజు తప్పనిసరిగా విధ్వంసం, గొడవలు, కొట్లాటలకు దారితీసేవి.ఈ నేపథ్యంలో ఇరువురి వర్గాలపై కేసులు కూడా నమోదై కోర్టు చుట్టూ కూడా తిరిగారు.ఇక వారి కలయిక సాధ్యం కాదని ఆ పార్టీ అధిష్టానంతో పాటు సీనియర్లు, పెద్దలు, పార్టీ కార్యకర్తలు భావించారు.కానీ వారిద్దరూ ఊహించని షాక్ ఇచ్చారు.ఉప్పునిప్పుగా ఉండే ఆ ఇద్దరు చేయిచేయి కలిపారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ ఇద్దరు నాయకుల కలయిక చర్చనీయాంశంగా మారింది.వారే మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి,భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి నిర్వహించిన పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను మంగళవారం వారు పరామర్శించారు.ఇద్దరు కలిసి వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం పేరిట రైతు దీక్షలు చేశారు.రేవంత్‌రెడ్డిపై ఉన్న కోపమే ఇద్దరి నాయకులను కలిపిందా..? శత్రువు-శత్రువు మిత్రుడు అనే నానుడి ఇద్దర్ని ఏకంచేసిందా..ఉప్పు-నిప్పుగా ఉండే ఇద్దరు నాయకులు ఒకే వేదికపై ప్రసంగించడం కార్యకర్తల్లో ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగించింది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు.అంతా కూడా సీనియర్ నాయకులే అయినా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఎప్పుడు కూడా కలిసి పని చేసింది లేదు.ఎవరి గుంపు వారిదే.పార్టీ బలంగా ఉన్నా నాయకుల నడుమ ఐక్యత లేక ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలహీన పడింది.ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డిలు ఆ తరువాతితరంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిగా పేరుగాంచారు.ఇందులో అందరూ పైకి నవ్వుతూ కలిసి కనిపించిన ఒకరికొకరి మధ్య సఖ్యత ఉండదనేది బహిరంగ రహాస్యమే.ఇటీవల పార్టీ పరిణామాల నేపథ్యంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి,ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మధ్య పొసగడం లేదు.ప్రధానంగా మునుగోడు ఉపఎన్నిక సమయంలో కోమటిరెడ్డికి చెక్ పెట్టె క్రమంలో రేవంత్‌రెడ్డి మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని ప్రత్యామ్నాయంగా ముందుకు తెచ్చి ఉపఎన్నికలో ప్రధాన బాధ్యతలు అప్పగించారు.కోమటిరెడ్డిని ఒక వైపు దూషిస్తూనే మరోవైవు దామోదర్‌రెడ్డిని టైగర్ దామన్నా అని సంబోధిస్తూ ఇద్దరి మధ్యవైరాన్ని వాడుకున్నారు.తన ప్రాబల్యం ఉన్న సూర్యాపేట,తుంగతుర్తి నియోజక వర్గాల్లో కోమటిరెడ్డి వర్గాలను ప్రోత్సహిస్తున్నాడని తనకి తెలియకుండా తన ప్రాంతాలకు వచ్చి హడావుడి చేస్తుండడంతో గతంలో,ఇటీవలే కాలంలో కూడా తుంగతుర్తి,సూర్యాపేటలలో కోమటిరెడ్డిపై దామన్న వర్గీయులు దాడి చేసిన విషయం తెలిసిందే.ఇదిగాక కోమటిరెడ్డి తనకు వ్యతిరేకమైన పటేల్ రమేష్‌రెడ్డికి అనుకూలంగా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాడనే కోపంతో దామన్న రగిలిపోయే వారు.వీరి మధ్య వైర్యం ఇలా నడుస్తుండగా... సూర్యాపేట డీసీసీ విషయంలో తన అనుచరుడు చెవిటి వెంకన్నయాదవ్ పేరును ప్రకటించాలని ఉత్తమ్‌తో సహా దామోదర్‌రెడ్డిలు రేవంత్‌రెడ్డిని కోరారు. అన్ని జిల్లాల్లో డీసీసీ నియామకాలు జరగగా సూర్యాపేట డీసీసీ పై అధిష్టానం నిర్ణయం ప్రకటించకుండా ఇంకా నాన్చుతుంది. ఇదిగాక సూర్యాపేట అసెంబ్లీ టికెట్ విషయంలో రమేష్‌రెడ్డిని తెరమీదకు తెచ్చి రేవంత్‌రెడ్డి అనిశ్చితికి కారణమయ్యాడని దామోదర్‌రెడ్డి లోపల రగిలిపోతున్నారు.ఈ రెండు విషయాలు దామోదర్‌రెడ్డిని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయనేది తెలిసిందే. కాగా మునుగోడు ఎన్నికల కోసం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు చేసినా తనకు సంబంధించిన వాటిపై పట్టించుకోకపోవడంపై దామన్న అసహనంతో ఉన్నారు.ఈ నేపథ్యంలో 2017 లో టీడీపీ నుండి కాంగ్రెస్‌లో చేరిన వారు పార్టీకి నష్టం చేస్తున్నారని దామోదర్‌రెడ్డి రాష్ట్ర ఇన్చార్జి ఠాక్రే కోదాడకు వచ్చిన సమయంలో తొలిసారిగా ఆయన రమేష్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.అయినా కూడా రమేశ్‌రెడ్డి పాదయాత్ర నియోజకవర్గంలో కొనసాగుతూనే ఉంది. రేవంత్‌రెడ్డికి చెక్ పెట్టాలని ఆశిస్తున్న కోమటిరెడ్డి దామోదర్ రెడ్డికి స్నేహ హస్తం చాటినట్టుగా సమాచారం.దామోదర్‌రెడ్డి కూడా విబేధాలను పక్కకు నెట్టి భవిష్యత్ కార్యాచరణ లో భాగంగా కోమటిరెడ్డితో కలిసి రాజకీయ ఎత్తుగడలకు సిద్ధపడుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.తిరుమలగిరి మండలంలో ఇరువురు కూడా హుషారుగా పాల్గొనడంతో పాటు ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రహస్యమంతనాలు జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ క్రమంలో ఈ ఇద్దరి కలయిక మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని... రాజకీయ సమీకరణాలు కూడా మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.