Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కబ్జా చేసి ప్రహరీ నిర్మాణం
- చెరువులకు నీరు చేరుట కష్టమే.!
- హారిక ప్యాకేజేస్ కంపెనీ నిర్వాహకం
- వార్త రాస్తే...లీగల్ నోటీసులు పంపిస్తానని బెదిరింపు
- అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం పంతంగి రెవిన్యూ పరిధిలోని ఆరెగూడెం గ్రామ శివారులో ఉన్న పెద్ద వాగు కబ్జాకు గురవుతుంది.తరతరాలుగా వర్షం నీరుతో ప్రవహిస్తున్న పెద్ద వాగు ను పక్కనే ఉన్న కంపెనీ యజమాని యధేచ్ఛగా కబ్జా చేసి నిర్మాణం చేస్తున్నారు. హారిక ప్యాకేజీస్ కంపెనీ 2004 సంవత్సరంలో రైతు నుండి భూమి కొనుగోలు చేసి కంపెనీ నిర్మించారు. ఆ సమయంలో వాగు ఉన్న విషయం కంపనీ యాజమాన్యానికి తెలుసు.19 ఏండ్ల తర్వాత పక్కనే ఉన్న వాగు పై కన్ను పడింది.ఇంకేం కబ్జా చేసి యదేచ్చగా నిర్మాణం చేస్తూ వాగు రూపం లేకుండా చేస్తున్నారు.
చెరువులోకి నీరు చేరడం కష్టమే
పెద్ద వాగులోకి దివిస్ కంపనీ వెనక ఉన్న భూముల నుండి వర్షం నీరు వచ్చి చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో ఉన్న చెరువులోకి చేరుతుంది.కంపనీ యాజమాన్యం వాగును కబ్జా చేయడంతో నీరు వచ్చే పరిస్థితి లేదు.ఇక వాగుపై నిర్మాణం చేసే దగ్గర పైభాగం వైపు ఉన్న వ్యవసాయ భూముల్లో నీరు వెళ్లే అవకాశం ఉంది.
నిబంధనలు తుంగలో తొక్కి
వాగులపై,నాలలపై ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని నిబంధనలు ఉన్న కూడా అవేమీ పట్టించు కోకుండా వాగును కబ్జా చేసి నిర్మాణం చేస్తున్నారు.ఇరిగేషన్ జీఓ ల ప్రకారం వాగులను ఆక్రమించిన,నిర్మాణం చేసిన నేరం.అయిన కంపెనీ యాజమాన్యం ఇవేమీ పట్టించుకోకుండా నిర్మాణం చేసి వాగును కనుమరుగు చేస్తుంది.చుట్టూ పక్కల రైతులు గగ్గోలు పెడుతున్న కూడా నిర్మాణం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.తక్షణమే ఇరిగేషన్ అధికారులు,రెవిన్యూ అధికారులు స్పందించి వాగు పై చేస్తున్న నిర్మాణాలను తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.ఇక వాగు కబ్జా చేసి నిర్మాణం చేస్తున్నారని వివరణ కోసం కంపెనీ యజమాని ప్రసాద్ ను సంప్రదిస్తే..వాగు నాకు పట్టా ఉంది.ఎక్కడ కబ్జా చేయలేదు.తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి, బండి సంజేల్ కి నోటీసులు ఇచ్చినట్టు మీరు వార్త రాస్తే మీకు లీగల్ నోటీసులు పంపిస్తానని బెదిరించడం కొస మెరుపు..
నిర్మాణం మొదలు పెట్టినప్పుడే చెప్పినం
మాజీ సర్పంచ్, జాల మల్లేశ్
హారిక కంపెనీ యాజమాన్యం వాగుపై నిర్మాణం చేస్తున్నప్పుడే గ్రామస్తులము చెప్పడం జరిగింది. వాగు పై నిర్మాణం చెయ్యొద్దు.వాగు ఎలా ఉందో అలానే వదిలి పెట్టాలని సూచించాము.కానీ కంపెనీ యజమాని మా గ్రామస్తుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా నిర్మాణం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
వాగు నా పట్టా భూమి....కంపెనీ యజమాని ప్రసాద్
నేను 2004 సంవత్సరంలో పంతంగి గ్రామానికి చెందిన ఓ రైతు నుండి కొనుగోలు చేశాను.సెంటు భూమి కూడా వాగు ను అక్రమించ లేదు. నాకు ఉన్న భూమిలో నిర్మాణం చేస్తున్నాను.అది నా పట్టా భూమి.
పట్టా భూములైనా వాగులను ఆక్రమిస్తే చట్టరీత్యా నేరం
ఇరిగేషన్ డిఈ, రాజవర్ధన్ రెడ్డి చౌటుప్పల్
వాగులను, నాలాలను ఎవరు కబ్జా చేసినా చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. పట్టా భూములైనా సరే వాగులను కూల్చేసే అధికారం ఎవరికి లేదు. వాగులపై అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులో పెడతాం. రెవిన్యూ అధికారుల సహకారంతో సర్వే చేసి, వాగులో నిర్మాణం చేస్తున్న వారిపై పోలీస్ ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తాం. ఆక్రమిత కట్టడాన్ని కూల్చివేసేలా చర్యలు తీసుకుంటాం.
సర్వే చేసి చర్యలు తీసుకుంటాం.
చౌటుప్పల్ తహసిల్దార్, శ్యామ్ సుందర్ రెడ్డి
వాగులను ఆక్రమించి నిర్మాణాలు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సర్వేయర్లు పంపించి సర్వే చేయించి నివేదిక ఆధారంగా నిర్మాణం చేపడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని, ఆ నిర్మాణాన్ని తొలగిస్తాం.
వాగులు,వంకలను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. వాగుల్లో ఉన్న ఇసుక ను తోడుతున్న వైనం ఒకవైపు ఉంటే.. వాగుల రూపాన్ని మాయం చేసే తీరు మరొక వైపు ఉంది.వర్షాలు పడితే వచ్చే నీరు చేరువలో చేరుతుంది.తద్వారా ఆ చెరువు చుట్టూ పక్కల ఉన్న భూములకు సాగునీరు అందుతుంది. వాగు గొంతుకు అడ్డుకట్ట వేస్తూ దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు.