Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28న భువనగిరిలో జనచైతన్య యాత్ర బహిరంగసభను జయప్రదం చేయండి
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశానికి ప్రమాదకరంగా మారిందని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం చీరిక సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి సీతారాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమం, లౌకిక ప్రజాస్వామ్యం, మతసామరస్యం, సామాజిక న్యాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనచైతన్య యాత్ర ఈ నెల 28న భువనగిరి పట్టణానికి వస్తుందన్నారు. పట్టణంలో నిర్వహించనున్న బహిరంగసభకు ప్రజలు, అభిమానులు, యువకులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మోడీ, అమిత్‌షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు కట్టబెడుతూ ప్రజలపై అనేక భారాలు మోపుతుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతూ కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయల లాభాలు దోచిపెడుతుందన్నారు. ఒకే మతం అంటూ హిందుయేతర మతాలపై దాడులు సాగిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ న్యాయ వ్యవస్థను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల నిరంకుశ వైఖరి కొనసాగిస్తూ ప్రజలను మతాలు, కులాలు, భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వన్నె తెచ్చిన కామ్రేడ్ దుంపల మల్లారెడ్డి స్మారకార్థం భువనగిరి పట్టణంలో నిర్మించిన స్మారక భవనాన్ని ఈ నెల 28న ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎమ్‌డి. జహంగీర్, జిల్లాకమిటీ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి, గంగదేవి సైదులు, తడక మోహన్, చెన్నబోయిన వెంకటేశం, కొండె శ్రీశైలం, పల్లె శివ, శ్రీనివాస్‌రెడ్డి, అంతటి అశోక్, బద్దం అంజయ్య, మాడగోని మారయ్య పాల్గొన్నారు.