Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన గ్రూప్ వన్,ఏ.ఈ మరియు ఇతర ఉద్యోగాల పరీక్షల పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్స్ లీకేజీ సమగ్ర దర్యాప్తు జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించాలని,విచారణ అంశాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక నలాల భావి సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్స్ లీకేజీ ఘటన రోజుకొక మలుపు తిరుగుతుందన్నారు. టీఎస్పీఎస్సీ విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు సాధించాలనే దృక్పథంతో సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకొని పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదకరంగా మారిందన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి సమయం అంతా ఉద్యోగం సంపాదించాలనే ఆశతో ప్రిపరేషన్ అయి క్వాలిఫై సాధించిన నిరుద్యోగులకు పేపర్స్ లీకేజీ ద్వారా జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేనిదని పేర్కొన్నారు. అత్యున్నత మైన టిఎస్పిఎస్సి లో ఇలాంటి లీకేజీ ఘటనలు జరగడం ద్వారా ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మీద ఉన్న నమ్మకం పోతుందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. పేపర్స్ లీకేజీ ఘటన పారదర్శకంగా విచారణ జరిపి నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పేపర్స్ లీకేజీ కేసులో నిజనిజాలను ప్రజల ముందు ఉంచి ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.ఉద్యోగాలు వస్తాయని ఆశతో చూస్తున్న అభ్యర్థులకు నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, మేకనబోయిన శేఖర్,జె. నరసింహారావు, చినపంగి నరసయ్య,వీరబోయిన రవి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వినోద్, సిపిఎం పట్టణ నాయకులు వల్లపుదాస్ సాయికుమార్, మామిడి సుందరయ్య, నల్లమేకల అంజయ్య,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.