Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామీణ ప్రాంతాల్లో వలసకు అడ్డుకట్ట వేసి, ఉపాధి కల్పనతో సామాజిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించినదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు ఆసరాగా ఉంటూ వస్తున్న ఈ చట్టానికికి కేంద్రంలోని మోడీ సర్కారు సమాధి కట్టేందుకు కుట్ర చేస్తున్నది. పల్లెల్లో జరుగుతున్న పనులకు ఆంక్షలతో ఆటంకం కలిగిస్తూ, నిబంధనల పేరుతో నిర్వీర్యం చేయాలని చూస్తున్నది. గ్రామాల్లో ప్రస్తుతం 50 రకాల పనులకు అనుమతి ఉండగా, ఇకపై 20 మాత్రమే చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా హుకూం జారీ చేసింది. ఆ పనులకు మాత్రమే బిల్లులు వచ్చేలా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు జిల్లావ్యాప్తంగా మూడున్నర లక్షల మంది ఉపాధిని దెబ్బతీయనున్నాయి. కేంద్రం తీరుపై గ్రామీణ ప్రాంతాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా, పేదోళ్ల పొట్టగొట్టే కొత్త నిబంధనలను వెనక్కి తీసుకోవాలని సర్పంచులు, కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
- కూలీల కడుపుకొట్టే కుట్ర
- పల్లెల అభివృద్ధిపై కేంద్రం కంటగింపు
- పనులు జరుగకుండా ఆటంకపరిచే ఎత్తుగడ
- 20 పనులకే పరిమితం చేస్తూ జీఓ
- ఇప్పటిదాకా 50 రకాల పనులకు అవకాశం
- జిల్లాలో 9లక్షల24 వేల 947 మంది కూలీలపై ప్రభావం
- వేసవి అదనపు కూలికీ మంగళం
- మోడీ సర్కారుపై సర్పంచులు, కూలీల మండిపాటు
నవతెలంగాణ- నల్లగొండ
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. పథకాన్ని కుదించేందుకు పన్నాగాలు పన్నుతున్నది. ఇందులో భాగంగా రాష్ట్రానికి దక్కే ప్రయోజనాలకు కోత పెడుతున్నది. గ్రామాల్లో జరిగే పనులకు ఆటంకం కలిగించే ఎత్తుగడ.. పల్లెల్లో అభివద్ధికి కత్తెర వేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. కార్మికులు పొట్ట కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇప్పుడున్న రూల్స్ కాదని.. ఒక్కో గ్రామంలో 20 పనులు మాత్రమే చేయాలని కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా సాప్ట్వేర్ కూడా తయారు చేసింది. ఫలితంగా గ్రామాల్లో అనేక రకాల పనులు నెమ్మదించనుండగా మరికొన్ని గ్రామాల్లో ఆగిపోనున్నాయి. గతంలో మాదిరిగా ఇక నుంచి ఒకేసారి అన్ని పనులు చేయడానికి వీలుండదు. ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు పనులు లేక గ్రామాల్లో ఉపాధికి కూడా గండి పడనుంది. అంతిమంగా పేదోడి పొట్టగొట్టి, బతుకులు ఆగం చేయనుంది. కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని, వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలనిదాంతో సర్పంచులు, కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఒక్కో గ్రామంలో 40కి పైగా పనులు..
ఉపాధి హామీ చట్టం కింద వివిధ రకాల పనులు చేపడుతుంటారు. ఈ పనులు రైతులు, స్థానికులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఏటా గ్రామ సభలు నిర్వహిస్తూ అవసరమయ్యే పనులు, ఖర్చును ముందుగానే అంచనా వేస్తారు. ఈవిధంగా గ్రామాల్లో ఎన్ని పనులైనా చేసుకోవడానికైనా వెసులుబాటు ఉన్నది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 844 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 40 నుంచి 50 రకాల పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజిస్తారు. ఏ కేటగిరీ కింద నేషనల్ రిసోర్స్ మేనేజ్మెంట్ వర్క్స్, 'బీ'లో వ్యక్తిగత పనులు, 'సీ'లో కామన్ వర్క్స్, డీ కేటగిరీ కింద రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు జరుగుతుంటాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1400 పనులు నడుస్తున్నాయి.
ఇక నుంచి 20 పనులే...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఇక నుంచి గ్రామాల్లో 40 నుంచి 50 పనులు చేసే వెసులుబాటు కోల్పోయినట్లయ్యింది. ఇందుకు అనుగుణంగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇక నుంచి ఒక్కో గ్రామంలో 20 పనులు మాత్రమే చేయాలి. ఈ పనులకే బిల్లులు శాంక్షన్ అవుతాయి. అదనంగా చేయాలంటే సాఫ్ట్వేర్ తీసుకోదు. 20 పనుల్లో నాలుగు ముగిశాకే.. మరో నాలుగింటికి అవకాశం ఉంటుంది. అంతిమంగా 20 పనుల కంటే మించకుండా రూల్స్ రూపొందించారు. ఒకవేళ మధ్యలో ఏదైనా పని అనివార్య కారణాలతో ఆగిపోయినా అది పూర్తయ్యే దాకా 20 పనుల లెక్కలోనే ఉంటుంది. దీని ఎఫెక్ట్ గ్రామాల్లోని ఇతర పనులపై పడనుంది. ముఖ్యంగా మేజర్ గ్రామాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో గ్రామంలో 50 పనులు జరుగుతున్న ఊర్లు కూడా ఉన్నాయని, 20 పనులకే కుదించడంతో ఇబ్బందులు తప్పవంటున్నారు.
అధికారులకు తలనొప్పులు..
మరోవైపు కొత్త నిబంధనలు అధికారులు, సిబ్బందికి తలనొప్పులు తీసుకురానున్నాయి. ఉపాధి హామీ చట్టం కింద మండల స్థాయిలో ప్రోగ్రామింగ్ అధికారిగా ఎంపీడీఓ,జిల్లా స్థాయిలో కలెక్టర్ ప్రోగ్రామింగ్ అధికారిగా ఉంటారు. ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్‌గా డీఆర్డీఓ ఉంటారు. వాస్తవానికి కూలీలు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో పని దినాలు కల్పించాలి. లేకుంటే వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటుంది. ఉపాధి హామీ చట్టం కూడా ఇదే చెబుతుంది. పనిని బట్టి నిరుద్యోగ భతి ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే పనులు లేకపోతే తామెక్కడి నుంచి కూలీ ఇప్పించాలని వారు వాపోతున్నారు.
ఉపాధి పనులపై నిబంధనలు దుర్మార్గపు చర్య
అయిత గోని యాదయ్య గౌడ్ సర్పంచ్ దోరేపల్లి కనగల్ మండలం
నిరుపేదలకు పనికల్పించే ఉపాధి హామీ పథకంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షకట్టే ధోరణి మానుకోవాలి. ఉపాధి హామీ పనుల నిర్వహణపై నిబంధనలు విధించడం దుర్మార్గపు చర్య. ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నది. కేంద్ర విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఒక పని పూర్తి చేసిన తరువాతే ఇంకో పనిని మొదలు పెట్టాలని ఆంక్షలు విధించడం సరికాదు.
కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
కొప్పుల ధనమ్మ రేగట్టే కనగల్ మండలం
ఉపాధిహామీ కింద గ్రామానికి కేవలం ఏకకాలంలో 20 పనులు కేటాయిస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించడం సరికాదు. మా గ్రామానికి 791 జాబ్‌కార్డులు ఉన్నాయి. గతంలో 40వరకు పనులు జరిగేవి. అయినప్పటికీ అందరికి ఉపాధి దొరకడం కొంత కష్టంగానే ఉండేది. ప్రస్తుతం కొత్త నిబంధనలు పెట్టి పనులను సగం వరకు తగ్గిచడంతో మరింత ఉపాధి తగ్గుతుంది. దాంతో కూలీలకు పని దొరకని పరిస్థితి. తక్షణమే ఈ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి.
ఉపాధి హామీ చట్టాన్నినీరుగారుస్తున్న కేంద్రం
కంకణాల వెంకట్ రెడ్డి బీిఆర్‌ఎస్ నాయకులు నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీని నీరుగార్చేందుకు కుట్ర పన్నుతున్నది. కొత్త నిభంధనలతో గ్రామాల్లో కొన్ని పనులే కేటాయిస్తామని ప్రకటించడం సరైంది కాదు. కూలీల బతుకులతో చెలగాటం ఆడుతున్నారు. గ్రామాల్లో ఊపాధి పనులు దొరకని పరిస్థితి నెలకొంటుంది. కేంద్రం వెంటనే ఈనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేనియెడల కేంద్రం ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
కూలీల ఉపాధికి కేంద్రం గండి..
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య
ఉపాధి హామీ చట్టం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి వంద రోజుల పని కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల5 వేల 263 జాబ్ కార్డులు ఉండగా, 9 లక్షల 24 వేల 947 మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరంతా గ్రామాలలో వేర్వేరు పనులు చేస్తుంటారు. కూలీలకు 40 నుంచి 20 వరకే పనులను కుదించడంతో దాదాపు సగం మంది ఉపాధికి గండి పడే ఛాన్స్ ఉన్నది. ఇక కొంతమంది కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతారు. అలాంటి వారికి అసలే పనులు ఉండకపోవచ్చు. ఇక భూమినిచదును చేసే పనులకు కూలీల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎండాకాలంలో కూలీలకు అదనపు కూలీ చెల్లిస్తారు. కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఇది లేదు. అంటే అదనపు కూలీకి కేంద్రం మంగళం పాడింది. మరో వైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి తప్పకుండా ఫొటో తీసి అప్లోడ్ చేయాలని ఆదేశించారు.