Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్ర ప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రజలకు మంచి సేవలు అందించడానికి పట్టణ వైద్యులు, ఆసుపత్రులు, వైద్య రంగం, వైద్య సంఘం వృత్తిలో నీతి కలిగి ఉండాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయం లో సూర్యాపేట పట్టణ ఆసుపత్రుల సీనియర్ వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగనిర్ధారణ, పిండ విచ్ఛిత్తి లాంటి వాటితో కొద్ది రోజులుగా పట్టణ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్స్, డయాగస్టిక్ సెంటర్స్, మెడికల్ రంగం వివాదాస్పదం అవుతుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్తితుల వల్ల వైద్యరంగం సమాజంలో విశ్వాసం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల అభివృద్ధి చెందుతున్న నూతన జిల్లా కేంద్రానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించడానికి పట్టణ వైద్యులు, ఆసుపత్రులు, వైద్య రంగం, వైద్య సంఘం కృషి చేయాలని కోరారు. చేసే వృత్తిలో నీతి కలిగి ఉండాలన్నారు. వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని, ఆసుపత్రులలో పని చేసే సిబ్బంది చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు.ఆర్.యం.పి లను ప్రోత్సహించవద్దన్నారు. వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని, ప్రజలు వైద్యునిలో దైవాన్ని చూస్తారని , ప్రజల్లో విశ్వాసం కోల్పోవద్దన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు, పిండ విచ్ఛిత్తి లాంటి చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడకుండా ఉండాలన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడే ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్స్, డయాగస్టిక్ సెంటర్స్, వైద్యులపై వాలెంట్రిగా మెడికల్ అసోసియేషన్ వారు ఫిిర్యాదు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, పట్టణ వైద్యులు పాల్గొన్నారు.