Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
భవిష్యత్తులో చందన పాఠశాల ఉన్నతంగా ఎదగాలని మున్సిపల్ ఛైర్మన్ వెన్రెడ్డి రాజు, తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఆనందచారి అన్నారు. శనివారం రాత్రి చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని చందన పాఠశాలలో 13వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ అవ్వారు రామేశ్వరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడారు. తరగతి గది అనేది సమాజ మార్పుకు నాందిగా ఉండాలన్నారు. పిల్లల భవిష్యత్తుకు చందన స్కూల్ నాంది కావాలన్నారు. పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల బాధ్యత ఎంత అవసరమో పాఠశాల యాజమాన్యానికి అంతే బాధ్యతగా ఉండాలని తెలిపారు. పిల్లలు శాస్త్రీయ అవగాహన, అల్లరి, ఆటలు, మారం చేసే స్వభావం, మట్టిలో ఆడడం తప్పు కాదన్నారు. ప్రకృతికి పిల్లలను అనుసంధానం చేయాలన్నారు. జ్ఞాపకం అనేది పిల్లల తెలివి కాదు ఆలోచన, పరిశోధన పిల్లల తెలివికి నిదర్శనమన్నారు. శ్రీశ్రీ కవితలు, ఠాగూర్ ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు పలువురిని అలరించాయి. అనంతరం ఛైర్మన్ రాజు, ఆనందచారిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బడుగు శ్రీరాములు, బత్తుల శంకర్, అవ్వారి గోవర్థన్, సుభాశ్, ఎస్ఐ సాయిలు, నల్లగిరి నటరాజ్, ముత్యాల సత్తిరెడ్డి, ఉపాధ్యాయులు స్వప్న, నర్మద, పద్మ, అర్చన, రేణుక, జగదీశ్వరి, సౌమ్య, ఉషారాణి, చంద్రమౌళి, కొరియోగ్రాఫర్లు శ్రీను, అశ్విని పాల్గొన్నారు.