Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'మనఊరు -మన చరిత్ర' కార్యక్రమంలో భాగంగా ఆదివారం చిలుకూరులో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన జరిగింది.రాజకీయాలకు అతీతంగా చిలుకూరులోని గ్రామపెద్దలు, సర్పంచ్, జెడ్పీటీసీ, దేవాలయ సంస్థ చైర్మెన్, గ్రంథాలయ చైర్మెన్, సింగిల్విండో చైర్మన్, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న చిలుకూరు గ్రామానికే చెందిన విద్యార్థులు తన ఊరు చరిత్రను రాయడానికి క్షేత్రస్థాయిలో విషయాలు తెలుసుకునేందుకు ఏ విధంగా అధ్యయనం చేయాలో అకాడమీ చైర్మెన్ జూలూరు వివరించి తెలిపారు.చిలుకూరులో 1969న మొదలైన గ్రంథాలయం వద్దకు వెళ్లారు.ఆ గ్రంథాలయ ఉద్యమంలో చిలుకూరు పాత్రను ఆ గ్రామపెద్దలను అడిగి విషయ సేకరణ ఎలా చేయాలో తెలిపారు.ఆనాటి విషయాలను, గ్రంథాలయాల ద్వారా తీసుకువచ్చిన చైతన్యాన్ని విద్యార్థులు తెలుసుకున్నారు.ఒక తరాన్ని ప్రభావితం చేయడంలో ప్రత్యక్షంగా గ్రంథాలయ పాత్రను గ్రామపెద్దలు చెబుతుంటే విద్యార్థులు గ్రహించారు.తన గ్రంథాలయానికి ఇంత గొప్పచరిత్ర ఉందని రాసుకున్నారు.చిలుకూరు ప్రభుత్వ ప్రాథమిక వైద్యక్రేంద్రానికి వెళ్లి ఆరోగ్యపరంగా చిలుకూరు ఏ విధంగా ఉంది? దీర్ఘకాలిక జబ్బులతో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? సీజనల్వ్యాధులకు చికిత్స ఏ విధంగా అందుతుందో తెలుసుకున్నారు.గ్రామంలో ముత్యాలమ్మ గుడి నిర్మాణం దగ్గరికి వెళ్లి ఎంత కాలము నుంచి ఆ దేవతను పూజిస్తున్నారు ? స్థానిక దేవతలను కొలిచే సంస్కృతిపై, స్థానిక జానపదకళలు, సాంస్కృతిక నేపథ్యం గురించి సవివరంగా వివరాలు సేకరించారు.చిలుకూరులో కాకతీయుల కాలం నాటి కోదాడ రామాలయం దేవాలయ నిర్మాణం జరిగిన తీరును ఈ తరం విద్యార్థులు పెద్దలను అడిగి తెలుసుకున్నారు.ఎంతో ప్రశస్తి వహించిన దేవాలయం అదేవిధంగా ఆ ప్రాంగణంలో నిర్మించిన కోనేరును విద్యార్థులు చూశారు. కోనేరు నిర్మాణంలో దేవాలయ అవసరాలతో పాటుగా, వ్యవసాయ అవసరాలు తీర్చుకునే విధంగా నిర్మించిన మోటబావి నిర్మాణం అన్నది విశేషంగా ఉంది. సాధారణంగా కోనేరులో ఇలాంటివి కనిపించవు. చిలుకూరు కోనేరు కున్న ప్రత్యేకతను విద్యార్థులు పట్టుకోగలిగారు.కాకతీయుల కాలంనాటి చెన్నకేశవాలయం, శివాలయాల నిర్మాణాలు అద్భుత శిలా కౌశలంతో ఉన్నాయి.చెన్నకేశవాలయంలో పురాతన శాసనం ఒకటి ఉంది. దాని గురించి పాత చారిత్రక గ్రంథాలను తీసి పరిశోధించాల్సి ఉందని స్థానికులు తెలిపారు.ముస్లిముల
మసీదు, రామాలయం పక్కపక్కనే కలిసి ఉన్నాయి. అలాగే గ్రామంలో క్రిస్టియన్ల చర్చి కూడా ఉండడం మత సామరస్య చిహ్నంగా చిలుకూరు ఎంతో కాలంగా వర్ధిల్లుతూ ఉందని చిలుకూరు గ్రామస్తులు గర్వంగా చెబుతున్నారు. చిలుకూరులో రెవెన్యూ విధానం, వ్యవసాయ విధానం, పంటలు వాటి ఉత్పత్తులు తదితర విషయాలను మండల రెవెన్యూ అధికారి, వారి సిబ్బంది తెలియజేశారు.కోదాడకు హుజూర్నగర్ దారి మధ్యలోని చిలుకూరు గ్రామం అనేది ఒకనాడు ఎర్ర భావాలు విరబూసిన ఎర్ర జెండాగా రెపరెపలాడుతూ ఉండేది. చిలుకూరు అంటే వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో మరిచిపోలేని ఎన్నెన్నో ఘట్టాలకు ఊపిరి పోసింది. బేతఓలు జమీందారుపై ప్రజా పోరాటం చేయడానికి చిలుకూరే కేంద్రంగా ఉంది.8వ నిజాం రాష్ట్ర మహాసభ చిలుకూరులో జరిగింది.ఇక్కడే రావినారాయణరెడ్డి ఆ మహాసభకు అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారని ఆ ఉద్యమ పోరాట ఘట్టాలను సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు దొడ్డ నారాయణరావు గుర్తు చేశారు.చిలుకూరులో ఆనాటి పోరాటయోధులు గుండెల పుల్లయ్య స్మారకస్థూపం చరిత్ర, దొడ్డ నరసయ్య పోరు చరిత్రను ఈ తరం విద్యార్థులు తెలుసుకొని తమ గ్రామ చరిత్రలో రికార్డు చేస్తున్నారు. తమ గ్రామానికి ఇంత గొప్ప పోరాట వారసత్వ చరిత్ర ఉందా అని విద్యార్థులు ఆశ్చర్యపోతున్నారు.కాంగ్రెస్కు చెందిన నాయకులు కూడా చిలుకూరులో ఉన్నారు.ఇప్పుడు బీఆర్ఎస్కు చెందిన నాయకుల సంఖ్య గణనీయంగా ఉంది. గత చరిత్రతో పాటుగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన వేగవంతమైన మార్పులను, తెలంగాణలో నాడు- నేడు పరిస్థితులను బేరీజు వేసుకొని అభివృద్ధిని రికార్డు చేస్తున్నారు.ఎనిమిదేండ్లుగా జరుగుతున్న పునర్నిర్మాణ పనులను తమ గ్రామ చరిత్రలో నమోదు చేయబోతున్నారు. జననం దగ్గర నుంచి మరణం వరకు, వైకుంఠ దామాల వరకు, కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవనాలు, రోడ్లు తదితర అభివృద్ధి పనులు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, షాది ముబారక్, కల్యాణలక్ష్మి, ఆసరా పలురకాల పింఛన్లు ప్రభుత్వ పథకాలపై విశ్లేషణలతో తమ గ్రామ చరిత్రలో నమోదు చేయబోతున్నారు.ఇది రేపటి చరిత్రకు ఒక దారిగా నేటి మన ఊరు- మన చరిత్ర నిలవబోతోంది.