Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దారి పొడవునా రేపరెపలాడిన ఎర్రజెండాలు
- వందలాది వాహనాలతో కవాత్
- ఎరుపెక్కిన మిర్యాలగూడ
నవతెలంగాణ -మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వ మతోన్మాదం, కార్పొరేట్లకు వ్యతిరేకంగా చేపట్టిన జన చైతన్య యాత్ర ఆదివారం సాయంత్రం మిర్యాలగూడకు చేరుకుంది. సూర్యాపేట జిల్లా నుండి నల్గొండ జిల్లాకు ఆదివారం సాయంత్రం వచ్చింది. జిల్లా సరిహద్దు అయిన మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్గేట్ వద్ద కమ్యూనిస్టు కార్యకర్తలు వందలాది వాహనాలతో యాత్రకు స్వాగతం పలికారు. అక్కడినుండి ఆలగడప, అవంతిపురం, బాధలపురం, రాంనగర్ బంధం, ఈదులగూడెం, హౌసింగ్ బోర్డు రాజీ చౌక్ మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ వరకు వాహనాలతో కవాత్ నిర్వహించారు. సుమారు పది కిలోమీటర్ల వరకు వందలాది బైకులతో కార్యకర్తలు ఎర్ర చొక్కాలు ధరించి ఎర్రజెండాలతో ప్రదర్శన చేశారు. యాత్ర జరిగినంత సేపు ప్రజలందరూ రోడ్డుపైకి వచ్చి ప్రదర్శనను తిలకించారు. సుమారు 2000 పైగా ద్విచక్ర వాహనాలతో కవాతు నిర్వహించడంతో మిర్యాలగూడ ఎరుపెక్కింది. గ్రామాల కూడల్లో పట్టణంలోని ప్రధాన కూడల్లో ఎర్రని తోరణాలు బ్యానర్లు ఫ్లెక్సీలతో అలంకరించారు. ఎర్రసైన్యంతో మిర్యాలగూడ ఎరుపెక్కి మరోసారి కమ్యూనిస్టు సత్తా చాటింది. స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ యాత్రకు సీపీఐ జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు, ఎంసీపీఐ నాయకులు వస్కుల మట్టయ్య సంఘీభావం తెలిపారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అఖిలభారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్, యాత్ర నాయకులు పోతినేని సుదర్శన్ మల్లు లక్ష్మి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రసంగాలు కార్యకర్తల్లో ఉత్సవం నింపాయి. రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ,సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్ ,డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, బావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, పోలబోయిన వరలక్ష్మి, ఆయూబ్, పరశురాములు చౌగాని సీతారాములు, తిరుపతి రామ్మూర్తి, కొటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.