Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోటీ47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడితో రికార్డ్
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దిగుబడి 40 లక్షల మెట్రిక్ టన్నులే
తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే 47 లక్షల దిగుబడి
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే వ్యవసాయానికి ఆదరణ
సాగర్ ఎడమ కాలువ నుండి వరుసగా 16వ పంటకు నీటి విడుదల
దేశంలో వ్యవసాయ రంగం మళ్ళీ చిగురిస్తున్నదంటే అది కెేసీఆర్ ద్వారానే మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
దండగ అనుకున్న వ్యవసాయం తెలంగాణలో పండగగా మారిందని అన్నారు. భారతదేశంలో వ్యవసాయం మళ్లీ చిగురిస్తున్నదంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారానే సాధ్యమైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్ర్రారంభించారు. వలిగొండ మండల కేంద్రంలో రూ.కోటీ 56 లక్షలతో నిర్మించబడే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. భువనగిరి పట్టణంలో 75 లక్షల నిధులతో నిర్మించే 1000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాము నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రైతు సేవా కేంద్ర భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 52 లక్షల 85 వేల నిధులతో దీనదయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా నూతనంగా నిర్మించిన పట్టణ నిరాశ్రయుల వసతి భవనానికి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. తదుపరి 2 కోట్ల నిధులతో నూతనంగా నిర్మితమైన జిల్లా గ్రంథాలయ భవనానికి ఆయన ప్రారంభోత్సం చేశారు. బీబీనగర్ మండల కేంద్రంలో ఒక కోటి 56 లక్షల రూపాయల నిధులతో నిర్మించబోయే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లడుతూ గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. గత ప్రభుత్వాలు సరైన చేయూత ఇవ్వలేదని, తద్వారా వ్యవసాయ రంగం దెబ్బతిన్నదన్నారు. రైతుల ఆశలు దెబ్బతిన్నాయన్నారు. రైతుకు పిల్లనివ్వలేని దుస్థితి అప్పుడు నెలకొన్నదన్నారు. వ్యవసాయం చేస్తున్నా అంటే భయపడి సిగ్గుపడే రోజుల నుండి కాలర్ ఎగరేసీ మేము చేస్తున్నది వ్యవసాయం అని చెప్పుకుని మురిసే వాతావరణం నెలకొందన్నారు. ఐటీ రంగంలో ఉన్నవారు కూడా తిరిగి ఊరి బాట పట్టారని, అందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చేపట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలే దోహదపడ్డాయన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాకే కోటి 47 లక్షల ధాన్యం దిగుబడితో రికార్డ్ సృష్టించిందన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణా ప్రాంతం నుండి కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికే పరిమితం కాగా, ఇప్పుడు కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే 47 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. అయినా రైతు వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి మనసులో తెలియని వెలితి ఉందన్నారు. కష్టానికి, పెట్టుబడికి సరిపడా రైతు దిగుబడి సాధించలేకపోతున్న బాధ ముఖ్యమంత్రిని వెంటాడుతుందన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపినప్పుడు మాత్రమే ఎకరాకు మూడు లక్షల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. కూరగాయలు మొదలు అనేక ప్రత్యామ్నాయ పంటలు ఉన్నప్పటికీ మూస పద్దతిలో వ్యవసాయానికి రైతు అలవాటు పడ్డారన్నారు. తెలంగాణా ఏర్పడితే రైతును రాజును చెయ్యొచ్చు అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అయితే నెరవేరిందని, అదే రైతు మరింత సుసంపన్నం కావాలి అన్నదే ముఖ్యమంత్రి తపన అని అన్నారు. సమైక్యాంధ్ర పాలనలో సాగర్ ఎడమ కాలువ కింద భూములకు వరుసగా మూడు మార్లు నీళ్లు విడుదల చెయ్యలేని దుస్థితి నుండి తెలంగాణా ఏర్పడ్డాక వరుసగా 16 సార్లు నీటిని విడుదల చేసుకున్నాం అంటే ముమ్మాటికి అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతనేనని ఆయన కొనియాడారు. రాష్ట్రం ఏర్పడ్డాకే వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించామని, మరింత పురోగతిని సాధించేందుకే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతుబందు పధకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణా పేరు ప్రపంచ చిత్రపటంలో మారుమ్రోగుతుందన్నారు. అందుకే వలసలకు కేరాఫ్ గా నిలిచిన మహబూబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన రైతులు వాపస్ రావడమే కాకుండా దేశం నలుమూలల నుండి తెలంగాణాకు వలసల ప్రవాహం జోరందుకుందన్నారు. మహాబుబ్ నగర్ జిల్లాలో వరి నాట్ల కోసం సరిహద్దున కర్నాటకతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆటోలు, ట్రాలీలు దాటిపోయి లారీలలో నాట్లు వేసేందుకు పొలాలు కోసేందుకు కూలీలు వలసలు వస్తున్నారు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతు మకుటం లేని మహారాజు గా వెలుగొందుతున్నారన డానికి నిదర్శనమని అన్నారు.ఈ కార్యక్రమాలలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ జడ5 అమరేందర్ గౌడ్, రైతుబంధు సమితి కన్వీనర్ కొలుపుల అమరేందర్, ఎంపీపీ నరాల నిర్మల, జెడ్పీటీసీ బీరు మల్లయ్య, సింగిల్ విండో చైర్మెన్ పరమేష్ రెడ్డి పాల్గొన్నారు.