Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
మున్సిపాలిటీ పరిధిలోని రాయినిగూడెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కుమార్తె పాదూరి కరుణ సోమవారం స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ...తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలకు తనవంతు సేవ చేయాలనే ఆలోచనతో, తల్లిదండ్రులు, మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహరెడ్డిల స్ఫూర్తితో వారి జ్ఞాపకార్ధం ప్రభుత్వ పాఠశాలలో చదువుచున్న విద్యార్థులు 100 మందికి స్కూల్ బ్యాగ్‌లు పంపిణీ చేశానన్నారు.తన బాల్యంలో తల్లిదండ్రులు ప్రజాపోరాటం, ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాలలో తీరిక లేకుండా వున్న సమయంలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు తనకు విద్యాబుద్దులు నేర్పడం వల్లనే,నేడు తాను సమాజానికి సేవ చేస్తున్నానని తెలిపారు.పాఠశాలలో చదువుతున్న విద్యార్దులకు బూట్లు, టైలు, బెల్ట్ లను కూడ జూన్‌లో ప్రారంభంలో అందజేస్తానని చెప్పారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.ప్రభుత్వ పాఠశాల అభివద్ధి కోసం స్ధల సేకరణలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. తన భార్య మల్లు లక్ష్మీని గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, గ్రామంలో బొడ్రాయి పండుగను, బోనాల పండుగ నిర్వహణతో పాటు, రోడ్లు డ్రెయినేజీల నిర్మాణం, స్కూల్ భవన నిర్మాణంతో పాటు పలు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లను తన సోదరి పాదూరి కరుణ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.ఈ సందర్భంగా పాఠశాలలో మొక్కలు నాటి, అనంతరం ఆలేటిఆటంలో మానసిక వికలాంగులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరారెడ్డి,వార్డు కౌన్సిలర్ ఎడ్లగంగా భవాని వీరమల్లు యాదవ్,ముత్యాల పిచ్చయ్యగౌడ్, మేకనబోయిన శేఖర్, గుర్రం వెంకటరెడ్డి, గుడిసె వెంకటేశం, ఎలుగూరి సిద్దు, బ్రహ్మచారి, విద్యార్థుల తల్లిదండ్రులు,స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.