Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌రూరల్
ఎనిమిదేండ్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జిల్లా ఇన్చార్జి ఆర్అండ్బీ చైర్మెన్ మెట్టు శ్రీనివాస్ అన్నారు.మంగళవారం స్థానిక కౌండిన్య ఫంక్షన్హాల్లో జరిగిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అనే నినాదాలతో ముందుకెళ్తుందన్నారు.రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, దళితబంధు వంటి పథకాలతో ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.అంతే కాకుండా మున్సిపాలిటీలకు, గ్రామాలకు అత్యధిక నిధులు కేటాయిస్తూ వాటి రూపురేఖలను మార్చుతుందన్నారు.నేడు గ్రామాలు కూడా పట్టణాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు.తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గం రూపురేఖలను మార్చామన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మెన్ దొంతగాని శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముడంగోపిరెడ్డి, మార్కెట్ మాజీ చైర్మెన్ వెంకట్‌రెడ్డి, అబ్దుల్ నబి,మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.