Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీపై విపక్షాల రాజకీయ దుష్ప్రచారం విలేకరుల సమావేశంలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ విలువలకు మోడీ ప్రభుత్వం ముప్పుగా మారిందని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ అణిచివేత చర్యలకు పాల్పడుతుందన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కోర్టు తీర్పు రాగానే గంటల వ్యవధిలో అనర్హత వేటు వేయడం, ఇల్లు ఖాళీ చేయించడం వంటి చర్యలు అన్నింటిని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలపై సాగిస్తున్న దాడిగానే పరిగణించాలి తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలపై అనవసర కేసులతో వేధింపులకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం తన మిత్రుడైన ఆధాని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడితే చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాఫెల్ కొనుగోలు అవినీతిని సైతం తొక్కి పెట్టారన్నారు. అదే సమయంలో 100 కోట్ల లిక్కర్ స్కామ్ పేరుతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే కుట్రతో కవితను అప్రతిష్ట పాలు చేసేందుకు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని చెప్పారు. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్రాల హక్కుల హరిస్తూ ప్రతిపక్ష ప్రభుత్వాలను బలహీనపరిచేలా, పరిపాలన దెబ్బతీసేలా చట్టసభలు ఆమోదించిన బిల్లులను పెండింగ్‌లో పెడుతూ కేంద్రం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందన్నారు. కేంద్రం నుంచి అందించాల్సిన నిధులు ఇవ్వకుండా ఆంక్షలు పెడుతూ ఆర్థికంగా, రాజకీయంగా ప్రతిపక్ష ప్రభుత్వాలను బలహీనపరిచే చర్యలను మోడీ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది అన్నారు. గవర్నర్ యూనివర్సిటీ బిల్లు ఆమోదించి ఉంటే ఇప్పటికే రిక్రూట్మెంట్ పూర్తికావచ్చేదన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణలో తప్పులు జరిగిన మాట వాస్తవమేనని, ప్రభుత్వం వెంటనే సిట్ వేసి నిందితులను అరెస్టు చేసి భవిష్యత్తు పరీక్షలకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ మంచి విజన్‌తో ముందుకు వెళ్తున్నారని టీఎస్పీఎస్సీ పరీక్షలలో పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను సైతం తొలగించారని, నిజాయితీపరుడైన అధికారి జనార్దన్‌రెడ్డిని చైర్మెన్‌గా నియమించారన్నారు. కొందరు స్వార్థంతో చేసిన పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని విపక్షాలు తమ రాజకీయ స్వార్థం కోసం మంత్రి కేటీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు వాడుకుంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో సమర్థ నాయకుడిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా గుర్తింపు తెచ్చుకున్న మంత్రి కేటీఆర్‌ను అబాసుపాలు చేసేందుకు పేపర్ల లీకేజీ వివాదం ఆసరాగా ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లు బురదజల్లే ప్రయత్నం చేయడం సరైనది కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే లక్ష్యంతోనే ప్రతిపక్షాలు కవిత, కేటీఆర్‌లపై దుష్ప్రచారం చేస్తున్నాయని, సీఎం కేసీఆర్ పాలన పట్ల వ్యక్తం అవుతున్న ప్రజాధరణ కింద ప్రతిపక్షాల ఆటలు ఓడిపోక తప్పదన్నారు.