Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీలిపోయిన కాంగ్రెస్ క్యాడర్
- పోటాపోటీగా జోడయాత్ర
- అయోమయంలో నియోజవర్గ ప్రజలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
వర్గ విభేదాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ.. గల్లీ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు సహజం. కానీ ఇదంతా అధికారంలో ఉన్నప్పుడు సాగింది. ఇప్పుడు పదేళ్లుగా అధికారం లేక చతికిల పడ్డ ఆ పార్టీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి పరిస్థితిలో అందరూ ఒక తాటిపైకి వచ్చి పార్టీని కాపాడాల్సింది పోయి ఎవరికి వారే అనే చందంగా వ్యవహరిస్తూ పార్టీకి మరింత నష్టం కలిగిస్తున్నారు. గతంలో ఒక తాటిపై నడిచిన మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడరు కొత్త వారి చేరికతో గ్రూపులుగా విడిపోయారు. పాత కొత్త అనే తేడాతో ఎవరికి వారే కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. మిర్యాలగూడలో నెలకొన్న గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికేందుకు కాంగ్రెస్ పెద్దాయన కుందూరు జానారెడ్డి జోక్యం చేసుకొని అందరిని రాజీపరిచారు. ఇకమీదట అందరూ కాంగ్రెస్ జెండా కింద పని చేస్తారని, గ్రూపులు ఉండవని, హాత్ సే హాత్ జోడోయాత్ర కలిసి చేస్తారని చెప్పి పది రోజులు కాకముందే అతని మాటను సైతం ధిక్కరిస్తూ గ్రూపులను కొనసాగిస్తున్నారు. ఎవరికి వారే తమ బడా నాయకుల ఆశీస్సులతో కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ ప్రతిష్ట కాకుండా వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుంటున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో నాలుగు వర్గాలు కుందూరు జానారెడ్డి అనుచరుల వర్గం, అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి వర్గం, బత్తుల లక్ష్మారెడ్డి వర్గం, కేతావత్ శంకర్ నాయక్ వర్గంగా చీలిపోయి కార్యక్రమాలు చేస్తున్నారు. వీరిలో ఇప్పట్లో ఐక్యత కనిపించే పరిస్థితి లేదు.
వ్యక్తిగత ఎజెండాతో జోడో యాత్ర...
నియోజవర్గంలో ప్రధానంగా నాలుగు గ్రూపులు ఉన్నప్పటికీ రెండు గ్రూపులు మాత్రం పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇరువర్గాల సైతం కాంగ్రెస్ జెండాతో గ్రామ గ్రామాన తిరుగుతూ వ్యక్తిగత ఏజెండాతో యాత్ర చేస్తూ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్యాడర్ రెండు వర్గాలుగా చీలుపై వారి వారి నాయకుల యాత్రలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఒకరు మాడ్గులల్లి, వేములపల్లి మండలాల్లో యాత్ర చేస్తుండగా మరొకరు దామరచర్ల, అడుదలపల్లి మండలాల్లో యాత్ర చేస్తున్నారు. యాత్రలో ఎవరికి వారే వ్యక్తిగతంగా తమ పేరుపై పాటలు తయారు చేయించుకుని వాటిని గ్రామాల్లో ప్రదర్శిస్తూ ఇమేజ్ పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పాటలు కాకుండా వ్యక్తిగత పాటలు ఉండడంతో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టకుండా, తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించకుండా యాత్రలు చేస్తున్నారు. ఒకరు ఇప్పటివరకు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను వివరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతుండగా.. మరొకరు ఎన్నో ఏండ్లుగా పార్టీలు నమ్ముకొని ప్రజా సేవలో అంకితమయ్యానని, తనను ఆశీర్వదిస్తే ప్రజల రుణాన్ని తీసుకుంటానని ఎవరికి వారే వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్నారు.
అయోమయంలో కాంగ్రెస్ శ్రేణులు
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల నాయకులు ఎవరికి వారే యాత్రలు చేస్తున్నడంతో కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో నెలకొంది. ఎన్నో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని పార్టీ అభివద్ధి కోసం పనిచేస్తున్న నిజమైన క్యాడర్ నాయకుల తీరుతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కష్టనష్టాల్లో పార్టీకి అండగా ఉన్న నాయకులు, కార్యకర్తలు నాయకుల తీరుపై అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారే యాత్రలు చేయడం... పార్టీని వదిలి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే పనిలో ఉండడంతో నిజమైన కేడర్ ఆ యాత్రలో పాల్గొనకుండా మౌనంగా ఉంటున్నారు. పార్టీ అభివద్ధి కాకుండా వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునేందుకు ఎవరికి వారే యాత్రలు చేస్తున్నారని ఆ పార్టీలోని అసంతప్తి నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలాగనే ఉంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వాటికి తీరని నష్టం జరుగుతుందని పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులు చర్చించుకుంటున్నారు.