Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమలుకు నోచుకోని బయోమెట్రిక్ విధానం
నవతెలంగాణ-నల్లగొండ
రేషన్ డీలర్లకు సరఫరా అయ్యే బియ్యం బస్తాల్లో తరుగుకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం స్టాక్ పాయింట్ గోదాముల్లో బయోమెట్రిక్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో గత ఫిబ్రవరి నుంచే దీనిని అమలు చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అమలు పర్చలేదు. మార్చి నుంచైన అమలు చేస్తారని డీలర్ల ఆశించగా ఈ నెలలోనూ కార్యరూపం దాల్చలేదు.
అక్రమాల నివారణకు..
నల్లగొండ జిల్లా కేంద్ర గోదాం నుంచి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు ప్రతి నెలా లారీల ద్వారా బియ్యం బస్తాలు సరఫరా అవుతాయి. ఒక్కొక్క బస్తాలో 50 కిలోల బియ్యం ఉంటుందని స్టాక్ పాయింట్ అధికారులు లెక్కలు కడుతుండగా తమ వరకు వచ్చేసరికి ప్రతి బస్తాలో మూడు నుంచి అయిదు కిలోల మేరకు తరుగు వస్తోందని డీలర్లు వాపోతున్నారు. రేషన్ దుకాణాల తనిఖీల సమయంలోనూ స్టాక్ పాయింట్ నుంచి బియ్యం తక్కువ వస్తున్న విషయాన్ని డీలర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తుండటమే కాకుండా వారి సమక్షంలోనే సంచిని తూకం వేయగా 50 కిలోలకు బదులుగా 45 నుంచి 47 కిలోలే ఉంటుంది. పారదర్శకత కోసం ప్రభుత్వం డీలర్లకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు పర్చేందుకు చర్యలు చేపట్టింది. దుకాణాల వద్ద లబ్ధిదారులు వేలిముద్ర వేసినప్పుడు ఈ-పాస్‌కు వేయింగ్ యంత్రాన్ని ఎలా అనుసంధానం చేస్తారో అదే విధంగా స్టాక్ పాయింట్ వద్ద డీలర్ల వేలిముద్రలతో బియ్యం అందజేయాలని నిర్ణయించింది. పాఠశాలలకు మధ్యాహ్న భోజన బియ్యం తక్కువ వస్తున్నాయన్న ఆరోపణలు రావడంతో గతంలో జీహెచ్‌ఎంల వేలిముద్రలతో ఈ విధానాన్ని అమలు పర్చారు. ఇప్పుడు ఇదే విధానాన్ని డీలర్లకు వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సాంకేతిక సమస్య సాకు..
గత ఫిబ్రవరిలో సాంకేతిక సమస్య సాకుతో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయలేదు. మార్చి నెల నుంచి మొదలు పెడుతామని చెప్పిన అధికారులు ఈ నెలలోనూ ప్రారంభించలేదు. దీంతో డీలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క బస్తాలో మూడు నుంచి అయిదు కిలోల వరకు తరుగు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం కమీషన్ ఇచ్చేదే తక్కువని.. పైగా తరుగు వల్ల నష్టపోతున్నామని డీలర్లు అంటున్నారు. ఏప్రిల్ నుంచైన బయోమెట్రిక్ విధానాన్ని వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీలు 844 ఉండగా అందులో రేషన్ దుకాణాలు 991, రేషన్ కార్డులు సంఖ్య 45,339 ఉంది. నెలకు బియ్యం పంపిణీ (మెట్రిక్ టన్నుల్లో) 4470,965 వరకు జరుగుతుంది.