Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లావ్యాప్తంగా కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
- ప్రధాన ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లావ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలను గురువారం భక్తులు ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. ప్రధాన ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రంలోనే రెండో భద్రాదిగా పేరుగాంచిన రామగిరి సీతారామచంద్రస్వామి దేవాలయంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య కన్నులపండువగా రాములోరి కల్యాణం జరిపారు. అంతకుముందు నల్లగొండ ఎమ్మెల్యే దంపతులు తన స్వగృహం నుండి స్వామివారికి తలంబ్రాలను బ్యాండ్ మేళాలతో గుడిలోకి తీసుకొచ్చారు. ఒక్కరోజు ముందుగానే ఆల యాలను విద్యుత్‌కాంతులతో ముస్తాబు చేసిన ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా సీతాసమేతుడైన శ్రీరామచంద్రున్ని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ఆవరణలోకి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో భాజాభజంత్రీలు, వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కల్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి దంపతులు, ఎస్పీ కే.అపూర్వరావ్ పాల్గొని స్వామివారి కల్యాణ వేడుకలను తిలకించారు. అనంతరం దేవాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పట్టణ ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, దేవాలయ చైర్మెన్ చకిలం వేణుగోపాలచారి, దేవాలయ ఈవో, పాలక మండలి సభ్యులు ఉన్నారు.
ఏర్పాట్లు చేయడంలో పాలకవర్గం విఫలం
ఎండలోనే నిల్చోని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు
రాష్ట్రంలోని రెండవ భద్రాదిగా పేరుగాంచిన రామగిరి సీతారామచంద్రస్వామి దేవాలయంలో కళ్యాణ మహౌత్సవానికి జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల నుండి కళ్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇందుకుగాను పాలకవర్గం గతంలో దేవాలయ ఆవరణ మొత్తం తడకల పందిరి వేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాటు చేసేవారు. ఈ సంవత్సరం పాలకవర్గం భక్తులకు సౌకర్యం ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కళ్యాణం వేళలో తడకల పందిరి వేయకుండా అక్కడక్కడ పలుచటి బట్ట తో టెంటు వేశారు. భక్తులు కూర్చోవడానికి సరిపడా కుర్చీలు లేకపోవడంతో ఎండలోనే నిల్చుని కళ్యాణాన్ని తిలకించారు.
శ్రీరామనవమి ఉత్సవాల్లో ప్రోటోకాల్ రగడ..
నల్లగొండ రామాలయంలో గురువారం నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల్లో ప్రొటోకాల్ అంశం వివాదంగా మారింది. ఆలయ చైర్మెన్, ఈవో ఆహ్వానితుల విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని తెలిసింది. స్థానికంగా ఉండే శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఫొటో లేకుండానే ఆహ్వాన పత్రికను ముద్రించడం, ఫ్లెక్సీల్లోనూ ఆయన ఫొటో పెట్టకపోవడం వివాదానికి కారణమైంది. ఆహ్వాన పత్రికలో తన ఫొటో లేకపోవడంతో గుత్తా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
దేవాలయంలో భారీ బందోబస్తు
శ్రీరామనవమి పురస్కరించుకొని రామగిరి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో డీఎస్పీ నర్సింహారెడ్డి పర్యవేక్షణలో టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తిరుమలగిరిసాగర్ : తిరుమలగిరి మండలం కేంద్రంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతత్వంలో రాష్ట్రంలో రామరాజ్యం నెలకొల్పారని పేర్కొన్నారు. అనంతరం శ్రీనివాస్ ఫంక్షన్ హల్లో వీరాభిమన్యు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మెన్ నాగేండ్ల వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పిడిగం నాగయ్య, మాజీ ఎంపీపీ చవ్వ బ్రహ్మానంద రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోతుగంటి తిరుమల్, మండల ఉపాధ్యక్షలు చవ్వ నాసర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అనుములఏడుకొండలు, పాక్స్ డైరెక్టర్ ఆవుల నాసర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు అంజిరెడ్డి,సీనియర్ నాయకులు సాంబశివారెడ్డి, పగడాల సైదులు, సోషల్ మీడియా అధ్యక్షులు ఇరిగి గోపి, వివిధ హౌదాలో వున్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గంలో సీతారామ కళ్యాణ మహౌత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలోని దేవాలయాల ముందు సీతారామ కళ్యాణ వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని కోదండ రామాలయంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహౌత్సవానికి ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత రామాలయంలో కూడా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నరసింహ, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, గాజుల ఆంజనేయులు, టీవీ యాన్ రెడ్డి, దేవేందర్ నాయక్ ,పున్న వెంకటేశ్వర్లు, పొన్నబోయిన సైదులు, జయప్రకాష్ నారాయణ ,నీల రవి ,ఇలియాస్, విజరు ,వనం జగదీశ్వర్, బొడ్డుపల్లి కృష్ణ ,కళ్యాణ మహౌత్సవంలో పాల్గొన్నారు.
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలోని వివిధ ఆలయాలలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాయిబాబా, వెంకటేశ్వర దేవాలయం, రామాలయం, పద్మశాలి భవన్, ఆంజనేయ స్వామి, శివాంజనేయ స్వామి దేవాలయాలలో జరిగిన కళ్యాణ వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు రామాలయం, అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి నకిరేకల్ తోపాటు మండలంలోని నోముల గ్రామంలో జరిగిన కల్యాణోత్సవం, కట్టంగూర్, మండలంలోని ఐటి పాముల గ్రామంలో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్ : చిట్యాల పట్టణములోని శివాలయంలో సీతారాముల కళ్యాణాన్ని కన్నల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా అండకానికి తీసుకువచ్చారు. చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి రజిత కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మెన్ రంగా వెంకన్న ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పచ్చకాతత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మెన్ కూరెళ్ళ లింగస్వామి, ఆలయకమిటీ చైర్మెన్ రంగా వెంకన్న, స్థానిక కౌన్సిలర్ గోధుమ గడ్డ పద్మ జలంధర్ రెడ్డి, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, పందిరి గీతా రమేష్, సిలివేరు మౌనిక శేఖర్, రేముడాల లింగస్వామి, నాయకులు వనమా వెంకటేశ్వర్లు, జిట్ట బొందయ్య, దాసరి నరసింహ, గంట్లా శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో గురువారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ డాక్టర్ మందుగుల విజయ్ కుమార్- చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ అలివేలు డాక్టర్ అలివేలు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. వారు శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వారు కల్యాణ వేదికపై కూర్చొని శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మర్రి రమేష్, మర్రి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.