Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు
నవతెలంగాణ- భువనగిరిరూరల్
సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని పేదలందరికీ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తానన్న రూ.3 లక్షలు వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని ముస్త్యాలపల్లి గ్రామంలో ఆ పార్టీ గ్రామ జనరల్ బాడీ సమావేశం పసునాది రామచందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల పైగా అధికారంలో ఉండి ఇల్లు లేని పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని ఇంటి స్థలాలు ఉంటే నిర్మాణానికి రూ.3లక్షలు ఇస్తామని చెప్పి మండలంలో ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదని ,నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. రెక్కాడితే డొక్కనిండని పేదలు నిరుపేదలు ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు కాపురాలు చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందన్నారు. మండలంలో ఇల్లు లేని పేదలను, అర్హత కలిగి పెన్షన్ రాని వారిని నేటికీ రేషన్ కార్డు లేని పేదలను సమీకరించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడ్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శివర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య పాల్గొని మాట్లాడారు. అనంతరం గ్రామ శాఖ నూతన కార్యదర్శిగా కళ్లెం లక్ష్మీనర్సయ్య, సహాయ కార్యదర్శిగా పసనాది రామచందర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వడ్డె మల్లయ్య, పసునాది నాగరాజు, గాదం సత్తయ్య, పసునాది చంద్రయ్య, పల్లపు ఉపెందర్, పసునాది స్వామి, గంటపాక కుమార్, గంటపాక దెవెందర్ పాల్గొన్నారు.