Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసన తెలిపిన ట్రాన్స్పోర్ట్ కార్మికులు
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న టోల్ చార్జీలను ఉపసంహరించుకోవాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని ఆల్ ఇండియా పబ్లిక్ అండ్ ప్రయివేట్ ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ. సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సుభాష్ విగ్రహం దగ్గర కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్‌ఫోర్ట్ కార్మికులపై వేస్తున్న బారాలకు నిరసనగా పదినిమిషాల వాహనాలు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2019 మోటార్ వాహన చట్టం తీసుకువచ్చి ట్రాన్స్‌ఫోర్ట్ డ్రైవర్లపై, వాహనదారులపై అనేక భారాలు మోపుతుందని ఆరోపించారు. ఫిట్నెస్ చార్జీలు, రోడ్ టాక్సీలు, ఇన్సూరెన్స్‌లు, టోల్ ఛార్జీలు విపరీతంగా పెంచి కార్మికులపై మోపుతున్న బారాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ట్రాన్స్‌ఫోర్ట్ రంగ కార్మికులు పోరాటాలకు సిద్ధమయ్యారని తెలిపారు. అందులో భాగంగా 10 నిమిషాలు వాహనాలు నిలిపివేసి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారని చెప్పారు. ఏప్రిల్ ఒకటి నుండి పెంచుతున్న టోల్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ట్రాన్స్‌ఫోర్ట్ రంగ కార్మికులందరూ పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కందుల అశోక్, వేముల వెంకన్న, ది ఎలక్ట్రిసిటీ స్టోర్ ప్రయివేట్ ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షులు నిరసన మెట్ల వెంకన్న, బాతుక యాదగిరి, జక్కల సాయి, నరసింహ, శేఖర్, సలీం, ప్రభుచారి తదితరులు పాల్గొన్నారు.