Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటి వెలుగు శిబిరం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పోడు భూములపై సమీక్ష
నవతెలంగాణ-మిర్యాలగూడ
అర్హులైన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ టీ. వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణం శాంతి నగర్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిర్యాలగూడ పురపాలక సంఘం బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న అనంతరం జిల్లా కలెక్టర్ కంటి వెలుగు శిబిరం తనిఖీ చేశారు. కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును, రికార్డులను, అద్దాల పంపిణి రికార్డులను పరిశీలించి, వైద్యాధికారులతో శిబిరాల నిర్వహణ తీరును తెలుసుకొన్నారు. ప్రతి రోజు సరాసరి 120 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి వివరించగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి రోజు కనీసం 140 మందికి కంటి పరీక్షలు చేయించేలా ఎస్‌హెచ్‌జీ, మెప్మా పొదుపు సంఘాల మహిళలూ, ఆశావర్కర్లు, అంగన్వాడీ, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం, సమన్వయంతో ప్రజలకు అవగాహన కలిగించి శిబిరానికి వచ్చేలా చూడాలన్నారు. అనంతరం శాంతి నగర్లో పట్టణ ప్రకృతి వనంను సందర్శించారు. పట్టణ ప్రకృతి వనం పరిశీలించి మున్సిపల్ కమిషనర్‌కు పలు సూచనలు చేశారు. పట్టణ ప్రకృతి వనంలో నడకదారి, ఫెన్సింగ్, ఇతర పనులు పూర్తి స్థాయిలో పది రోజుల్లో చేపట్టి అభివృద్ధి పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తిరునగరు భార్గవ్, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
పోడు భూముల పై సమీక్ష
మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయంలో మిర్యాలగూడ ఆర్డీఓ, మిర్యాలగూడ, దామరచర్ల, నిడమానూరు, త్రిపురారం, తిరుమలగిరి సాగర్, పెద్దవూర, అడవిదేవులపల్లి మండలాల ఎంపీడీఓలు, తహశీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు, అటవీశాఖ అధికారులతో కలిసి పోడు పట్టాలు పంపిణీకి జాబితాపై సమీక్షించారు. పోడు సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీకి రూపొందించిన అర్హుల జాబితాపై సమీక్షించి సూచనలు చేశారు. సబ్ డివిజనల్ కమిటీలో తిరస్కరించిన వాటికి సరైన కారణాలు తెలుపాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలననుసరించి పంచాయతీ, రెవెన్యూ, అటవీ అధికారులు పరిశీలన చేసి ఎఫ్ఆర్సీ కమిటీ అర్హులైన వారు తిరస్కరణకు గురికాకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ చెన్నయ్య తదితరులు ఉన్నారు.
వేములపల్లి పీహెచ్సీలో మహిళా ఆరోగ్య కేంద్రం తనిఖీ
శుక్రవారం వేములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ టీి.వినయ్‌కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి మంగళవారం మహిళలకు నిర్వహించే ఆరోగ్య పరీక్షలు నిర్వహణ తీరు, చికిత్సకు జిల్లా ఆస్పత్రికి రిఫరల్ చేస్తున్న వివరాలు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఆరోగ్య మహిళా కేంద్రాలకు వచ్చే మహిళలకు 8 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందించాలని, సూక్ష్మ పోషక లోపాలు, శారీర బరువు నిర్వహణ, క్యాన్సర్ స్క్రీనింగ్, రొమ్ము క్యాన్సర్, మెనోపాజ్ నిర్వహణ, మూత్రనాల ఇన్ఫెక్షన్, రుతుస్రావ సమస్యల నిర్వహణ, సుఖ వ్యాధులు మొదలైనవి సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రధాన శాఖలు ఆరోగ్య, మెప్మా, ఎస్‌హెచ్‌జీ గ్రూప్ మహిళల సమన్వయంతో మహిళలు ఉపయోగించుకునే విధంగా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. అవసరమైతే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్సకు పంపించాలన్నారు.
సాగు చేసుకుంటున్న వారందరికీ పొడు పట్టాలివ్వాలి
పోడుభూములు సాగు చేసుకుంటున్న అర్హులైన వారందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పోడు పట్టాల పంపిణీ కోసం రూపొందించిన అర్హుల జాబితాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిర్యాలగూడ డివిజన్ మొత్తం 12,337 దరఖాస్తులు రాగా ఫారెస్ట్ రిజర్వేషన్ కమిటీ 8,000 దరఖాస్తులను తిరస్కరించిందన్నారు. అలాగే 845 దరఖాస్తులను డివిజన్ స్థాయిలో తిరస్కరణకు గురయ్యాయన్నారు. 1,213 మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అయితే తిరస్కరణకు గురైన దరఖాస్తులపైన మళ్లీ విచారణ జరిపి అర్హులు ఉంటే పోడు పట్టాలు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జి ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎవో రాధ, ఎఫ్ఆర్ఓ ఆనందరెడ్డి, బాలాజీనాయక్ తాసిల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.