Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండటి మల్లయ్య
నవతెలంగాణ -రామన్నపేట
నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన అభివృద్ధి ఏమీలేదని, ప్రజలు, కార్యకర్తల చేత అభివృద్ధి అని పలికించటమే అభివృద్ధిగా పెట్టుకున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండటి మల్లయ్య విమర్శించారు. మండలంలోని నిర్నేముల గ్రామంలో శనివారం హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి కరపత్రాలను అందించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన వైఫల్యాలను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న పార్టీలకు, పాలక ప్రభుత్వాలకు, నాయకులకు ప్రజలు బుద్ది చెప్పడానికి సన్నద్ధమవుతున్నారని అన్నారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రామన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ హయంలో చేసిన అభివృద్ధి తప్ప, నేటి ప్రభుత్వం చేసిన అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని ఆయన విమర్శించారు. గ్రామ గ్రామానికి లక్షలు, కోట్లు ఖర్చు పెట్టామని ప్రగల్బాలు పలుకుతున్న పాలకులు అక్కడక్కడ నాలుగు సీసీ రోడ్లు వేసి అదే అభివృద్ధిని పలికిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రామన్న పట్టణ అధ్యక్షుడు జమీరుద్దిన్, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు ఏజాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు గుండా జలంధర్ రెడ్డి, గురుకు శివ, జానీ, ఆవుల వేణు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవుల నరసింహ, తిరుమలయ్య, పెరుమండ్ల నవీన్ కుమార్, నోముల ధనమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సాయం అందజేత...
మండలంలోని నిర్నేముల గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు నోముల లలిత భర్త పరమేష్ ఇటీవ ఆనారోగ్యంతో మృతి చెందడంతో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య వారి ఇంటికి వెళ్లి, పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేస్తారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ముత్యాల ముత్తయ్యను పరామార్శించి, ఆర్థిక సహాయం అందించారు. ముత్తయ్య కుమార్తె డిగ్రీ పూర్తిచేసుకుని ఇంట్లో ఉండటాన్ని ఆయన గమనించారు. ప్రైవేట్ సెక్టార్ లో ఆమె చదువుకు తగిన ఉద్యోగాన్ని ఇప్పించడానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.