Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్చార్జీలను నియమించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధిష్టానం
- పదవుల కోసం పాకులాడుతున్న నాయకత్వం
- పట్టించుకునే దిక్కు లేక అల్లాడుతున్న కార్యకర్తలు
సంస్థాన్ నారాయణపురం:మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు పదవులు,టిక్కెట్ల కోసం పాకులాడుతున్నారే తప్ప కార్యకర్తలను కనీసం పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వీడీ బీజేపీలో చేరడంతో నియోజకవర్గంలో పార్టీ చిన్న భిన్నమైంది. నియోజక వర్గ ఇన్చార్జీలను నియమించడంలో అధిష్టానం నిర్లక్ష్యం చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ ఓట్లతో గెలుపొందినప్పటికీ కాంగ్రెస్ కాదు కోమటిరెడ్డి బ్రదర్స్ అనే బ్రాండ్ కే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తన బ్రాండ్ ఇమేజ్ కోసం నిర్మించుకున్న మండల,గ్రామ కమిటీలను మూకుమ్మడిగా రాజీనామా చేయించారు. దీంతో అంతకుముందు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న పాల్వాయి స్రవంతియే కార్యకర్తలకు పెద్ద దిక్కు అయింది. ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నప్పటికీ కార్యకర్తలకు నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వడంలో పూర్తిగా విఫలం చెందారనే విమర్శలు ఉన్నాయి.రాజగోపాల్ రెడ్డి ఇచ్చే థాయిలాలకు ఆకర్షితులైన నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ సర్పంచ్,ఎంపీటీసీ,జెడ్పిటిసి లు బిజెపి, బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.అయినా రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు.ఆశించిన మేర తైలాలు అందకపోవడం,గెలిపించిన ప్రజలతో విమర్శలు ఎదుర్కోవడం స్థానిక ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. దీనికి తోడు బిజెపి,టిఆర్ఎస్ పార్టీల్లో ఇవ్వలేక వలస వెళ్లిన ప్రజాప్రతినిదుల పరిస్థితి తిరిగి మాతృ పార్టీలోకి రాలేక ముందు నుయ్యి వెనుక గొయ్యి లా మారింది.టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న చలమల కృష్ణారెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు ముందు టికెట్ ఆశించి పార్టీలోకి వచ్చారు. చివరి వరకు తీవ్ర ప్రయత్నం చేసి విఫలం చెందారు. అధిష్టానం నియమించిన అభ్యర్థి గెలుపు కోసం సొంత ఖర్చులు సైతం పెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ల అభ్యర్థన మేరకు టికెట్ సాధించిన పాల్వాయి స్రవంతి బీజేపీి, బీఆర్ఎస్ ధన ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఓటమిపాలైన పాల్వయి స్రవంతి, టికెట్ ఆశించి విఫలం చెందిన చలమల కృష్ణారెడ్డి లు నియోజకవర్గంలో అడపా దడప తిరుగుతూనే ఉన్నారు.శుభ ఆశుభ కార్యక్రమాలకు తోచినంత సాయం అందిస్తున్నారు. ఇరువురు పోటా పోటీగా కార్యక్రమాలు చేపడుతుండడంతో ఉన్న కొద్దిమంది కార్యకర్తలు అయో మయానికి గురవుతున్నారు. ఇన్చార్జి బాధ్యతలు లేకున్నా చలమల కృష్ణారెడ్డి ఓ ఆడుగు ముందుకేసి గ్రామ మండల కమిటీలను జిల్లా అధ్యక్షుల సహకారంతో నియమిస్తున్నారు. దీంతో పాల్వాయి స్రవంతి ఏఐసీసీ నాయకుల వద్ద రచ్చ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.జరగనున్న సాధారణ ఎన్నికల్లో తిరిగి మునుగోడు టికెట్ తనకే ఇవ్వాలని పాల్వాయి స్రవంతి, ఉప ఎన్నికలో తనకు టికెట్ ఇవ్వకున్నా స్రవంతి గెలుపు కోసం తను ఖర్చు పెట్టుకొని నష్టపోయానని ఈసారి తనకే అవకాశం ఇవ్వాలంటు చలమల కృష్ణారెడ్డి ఎవరికి వారు అధిష్టానం వద్ద తమ లాబింగ్ నడుపుతున్న ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో కార్యకర్తలను మాత్రం ఇరువురు అనుకున్న మేర పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదవుల కోసం పాకులాడుతున్నారే తప్ప పార్టీ పటిష్టత కోసం పనిచేయడం లేదనే విమర్శలు జోరు అందుకున్నాయి. అవసరాల కోసమో అభ్యర్థుల కోసమో అప్పటికప్పుడు పార్టీ మారిన ప్రజాప్రతినిధులను తిరిగి మాతృ పార్టీ అయినా కాంగ్రెస్ లోకి రావాలని ఉన్నప్పటికీ నచ్చజెప్పి తీసుకువచ్చే ప్రయత్నం చేయడంలో ఇటు పాల్వాయి స్రవంతి అటు చల్లమల్ల కృష్ణారెడ్డి పూర్తిగా విఫలం చెందారనే విమర్శలు వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ మారితే తమ క్యారెక్టర్ దెబ్బతింటుందని భావించిన కొంతమంది సీనియర్ కార్యకర్తలు, నాయకులు పాల్వాయి స్రవంతి,చలమల కృష్ణారెడ్డి లతో సన్నిహితంగా ఉంటూనే బీజేపీిలోకి పోయిన రాజగోపాల్ రెడ్డికి కోవర్టు లుగా పనిచేస్తున్నట్లు సొంత పార్టీ కార్యకర్తల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ మునుగోడు నియోజక వర్గాన్ని ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు.కాంగ్రెస్ను వీడి బీజేపీ నుంచి పోటీ చేసిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకునేందుకు పరోక్షంగా పాల్వాయి స్రవంతికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టి పార్టీ ఓటమికి కారకులు అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో చిన్న భిన్నమైన కాంగ్రెస్ను కాపాడడంలో ఎంపీ వెంకట్ రెడ్డి పూర్తిగా విఫలం చెందినట్టు ఆరోపణలు ఉన్నాయి.