Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిల్లర్ల మాయాజాలంతో రైతులు బలవుతున్నారని రైతుసంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు ఆరోపించారు.మంగళవారం ఆంధ్రా నుంచి వచ్చిన లారీల వద్ద నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పది రోజుల కిందటే యాసంగి సీజన్ ప్రారంభమైందన్నారు.మొదట్లో రైతుల వద్ద మిల్లర్లు అధిక ధర వెచ్చించి ధాన్యం కొనుగోలు చేశారని తెలిపారు.సోమవారం సాయంత్రం నుండి క్వింటాకు రూ.150 నుండి రూ. 200 తగ్గిస్తున్నారని ఆరోపించారు.ఆంధ్రా నుంచి పెద్దఎత్తున ధాన్యం దిగుమతి చేసుకోవడం వల్ల ధర తగ్గించారని విమర్శించారు.ఒక్కో మిల్లుకు రోజుకు ఎనిమిది నుంచి పది లారీల్లో ధాన్యం దిగుమతి అవుతుందన్నారు.దాని పద్ధతిగా ఇక్కడ పండిన పంటకు ధర తగ్గుతుందని వాపోయారు.ఆంధ్రా ప్రాంతంలో బ్రోకర్లు ధాన్యాన్ని తక్కువ ధర కొనుగోలు చేసి లారీలో రవాణా చేస్తున్నారని చెప్పారు. అక్రమరవాణా అరికట్టాల్సిన అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ధాన్యం రాకను పూర్తిగా అరికట్టి ఇక్కడ ధాన్యాన్ని మంచి ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొత్త రాములుగౌడ్, శీలం గిరి, చిలకలసైదులు, వెంకటయ్య, మహేందర్రెడ్డి, రామలింగం తదితరులు పాల్గొన్నారు.