Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో భాగస్వామ్యం వహించినట్టు పోలీసు విచారణ(ఎఫ్ఐఆర్)లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ని ఎ1గా పేర్కొన్నందున కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ డిమాండ్‌చేశారు. గురువారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలో కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కష్టపడి కుటుంబాలకు దూరంగా ఉండి ఉన్నత ఉద్యోగాలు చేయాలని అనేక మంది నిరుద్యోగులు డబ్బులు చెల్లించి శిక్షణ కేంద్రాలకు వెళ్లి ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగం కోసం పరీక్ష రాసిన తర్వాత పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రావడం వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ పదో తరగతి పేపర్ లీకేజీ చేయడం బీజేపీ నాయకుల కుట్ర అన్నారు. ప్రతిరోజూ నీతులు వల్లించే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూత్రధారిగా ఉండడం సిగ్గుచేటన్నారు. బండి సంజరు విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాల మీద దెబ్బకొట్టడం దారుణమన్నారు. బండి సంజరు ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. బీజేపీ కావాలని నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుందన్నారు. పేపర్ లీకేజీకి పాల్పడిన బండి సంజరుని, అందులో పాల్గొన్న వారిని వెంటనే కఠినంగా శిక్షించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల, మున్సిపల్ కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహా, జిల్లాకమిటీ సభ్యులు గుంటోజు శ్రీనివాస్‌చారి, గడ్డం వెంకటేశ్, నాయకులు రాగీరు కృష్ణయ్య, బొడ్డు అంజిరెడ్డి, పల్లె మధుకృష్ణ, ఉప్పలపల్లి బాలకృష్ణ, పల్లె శివ, చీకూరి ఈదయ్య, మొగుదాల రాములు పాల్గొన్నారు.