Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటి వెలుగు సౌకర్యాల పట్ల ఆ సంతృప్తి
- నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
- ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్కట్‌పల్లి పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద జన సంచారం చూసి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పోలీస్ కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. గురువారం మండల కేంద్రంలో ఎస్పీఆర్ ఇంగ్లీష్ మీడియం పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద జన సంచారం లేకుండా పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
కంటి వెలుగు సౌకర్యాల పట్ల ఆ సంతృప్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మండల పరిధిలోని చౌడంపల్లి గ్రామంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి వెలుగు శిబిరంలో ఉండాల్సిన కనీసం సౌకర్యాలు లేకపోవడంతోఆ సంతృప్తిని వ్యక్తం చేస్తూ డీఎంహెచ్ఓ కొండలరావుకు శిబిరం తనిఖీ చేసి సౌకర్యాలు మెరుగుపరచాలని ఫోన్లో ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలన్నారు.
నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
రానున్న వర్షాకాలంలో హరితహారం ద్వారా మొక్కలు నాటేందుకు నర్సరీలో మొక్కల పెంపకం నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. చౌడంపల్లి గ్రామ నర్సరీ తనిఖీ చేశారు. నర్సరీలో మొక్కలు ఎక్కువగా పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం వరకు మొక్కలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. నర్సరీలో నిర్వహణపై అశ్రద్ధగా ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీలో వచ్చే సీజన్ హరితహారానికి సరిపోను మొక్కలను పెంచాలని, నేమ్ బోర్డులు పెట్టించాలని ఆదేశించారు. అనంతరం బ్రాహ్మణ వెల్లంల బృహత్ పల్లె ప్రకృతి వనంను సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సైదులుగౌడ్, ఎంపీడీవో యాదగిరిగౌడ్, ఆర్ఐ వరుణ్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.