Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం జరుగుతున్న సీపీఐ(ఎం), సీపీఐ ఉమ్మడి రాష్ట్రస్థాయి సమావేశానికి నల్లగొండ పట్టణం నుండి సీపీఐ(ఎం) నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, వ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యంగా ప్రజా పోరాటాలు నిర్వహించడానికి భవిష్యత్ కార్యాచరణ ఈ సమావేశంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతు దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర, ఉపాధి హామీ రక్షణ కోసం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ రద్దుకై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులేషన్, పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ తరలి వెళ్లే వారిలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ, పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, దండంపల్లి సరోజ, గంజి నాగరాజు బోడ ఇస్తారి, రుద్రాక్షి శేఖర్ సలివొజు సైదాచారి, కానుగు లింగస్వామి తదితరులు ఉన్నారు.
మర్రిగూడ : హైదరాబాదులో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ బహిరంగ సభకు ఆదివారం సీపీఐ(ఎం) నాంపల్లి, మర్రిగూడ మండలాల నాయకులు తరలి వెళ్లారు. తరలి వెళ్లిన వారిలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, కొమ్ము లక్ష్మయ్య, మైల సత్తయ్య, ఎడ్ల లక్ష్మయ్య, ఎడ్ల సత్తయ్య, ఒట్టికోటి పాండు తదితరులు ఉన్నారు.