Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగయ్య వర్థంతిలో సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండరూరల్
పేదలకు భూములు పంపిణీ చేయడం ద్వారానే ఆర్థికంగా బలోపేతం అవుతారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం కనగల్లు మండల కేంద్రంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వేముల నాగయ్య 7వ వర్థంతి సందర్భంగా స్థూపం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండే కమ్యూనిస్టు భావాలవైపు ఆకర్షితుడైన నాగయ్య పాలేరుల జీతాలు పెరగాలని, పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, కూలి రేట్లు పెంచాలని, భూముల పంచాలని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ కోసం జరిగిన పోరాటంలో చురుకుగా పాల్గొని ప్రజలను సమీకరించారని తెలిపారు. గీత కార్మికుల, వ్యవసాయ కార్మికుల కోసం హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన సేవలను కొనియాడారు. వారి స్ఫూర్తితో నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై జరిగే పోరాటాలలో ప్రజలు పాల్గొనడమే వారికి నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, మండల సహాయ కార్యదర్శి కానుగు లింగస్వామి, నాయకులు పోలే సత్యనారాయణ, నెలగొందారాసి లింగయ్య, అక్రమ్, సుల్తానా, లక్ష్మమ్మ, రాంబాబు, కుటుంబ సభ్యులు వేముల సాయమ్మ, రమేష్ పాల్గొన్నారు.