Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేసవిలో పిల్లలపై జాగ్రత్తలు అవసరం
నవతెలంగాణ-నల్లగొండ
వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఏటా మార్చి 15 నుంచి పాఠశాలలకు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు పూర్తవగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట తరగతులు కొనసాగిస్తున్నారు. ఆ తరువాత విద్యార్థులు ఇండ్లకు వెళ్లిపోతున్నారు. అప్పటి నుంచే తల్లిదండ్రులకు సమస్యలు ఎదురవుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండలోనే పిల్లలు ఆటలాడేందుకు బయటకు వెళ్తుంటారు. తల్లిదండ్రులు ఎంత వారించినా ఇంటి పట్టున ఉండేందుకు సుముఖత చూపరు. ఇంట్లో చెప్పకుండానే స్నేహితులతో కలిసి సరదా కోసం బయటకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతుంటారు. ఒక్కోసారి ఆనందం వెంటే విషాదం పొంచి ఉంటుందన్న విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాల్సిన అవసరం ఉంది. గతంలో చాలా సందర్భాల్లో చెరువులు, కుంటలు, బావుల్లో ఈతకు వెళ్లిన విద్యార్థులు మత్యువాత పడిన ఘటనలున్నాయి. ఒంటిపూట బడులనేవి పిల్లల ఆరోగ్యాన్ని దష్టిలో పెట్టుకొని ఇచ్చిన వెసులుబాటని తల్లిదండ్రులు గ్రహించి అప్రమత్తంగా ఉండాలి. ఒంటిపూట తరగతులు ముగియగానే మధ్యాహ్నం సమయంలో పిల్లలను సాధ్యమైనంత వరకు బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో వీలును బట్టి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు పిల్లలతో గడిపేందుకు అధిక సమయం కేటాయించాలి. ఇంటి వద్ద ఉన్న సమయంలో విద్యార్థులు ఇంటి పని చేయడంలో సహకరిస్తూ ప్రోత్సహిస్తే ఉత్సాహంగా ఇంట్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతారు.
ఈతపై పిల్లల ఆసక్తి....
వేసవిలో పిల్లలు సరదాగా ఈతకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, బావుల్లో ఈత కొడుతుంటారు. సరదా మాటున ప్రమాదం పొంచి ఉందనే విషయం గ్రహించాలి. ఈత నేర్చుకునేందుకు చిన్నారులు చెరువులు, కుంటలు, బావుల్లో లోతును పట్టించుకోకుండా వాటిలో దిగుతుంటారు. తీరా దిగాక లోతు అధికంగా ఉండటం, అందులో మట్టి పేరుకుపోయి ఉండటం, తదితర కారణాల వల్ల చిన్నారులు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలకు ఈత నేర్పించడం మంచిది.
పుస్తక పఠనంతో విజ్ఞానం...
విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి రాగానే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పుస్తక పఠనం అలవాటు చేస్తే ప్రమాదాలను నివారించడంతో పాటు వారిలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. జాతీయ నాయకుల స్ఫూర్తి గాథలు, నీతి కథలు చదివేలా ప్రోత్సహించాలి. చరవాణి వినియోగంపై ఎక్కువ ఆసక్తి చూపకుండా శ్రద్ధ తీసుకోవాలి. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకుంటే పిల్లలు బయటకు వెళ్లి ప్రమాదాల బారినపడే అవకాశం ఉండదు. అవసరమైతే కొద్ది సేపు నీడ పట్టున ఆడుకునే ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేలా చూసుకోవాలి. చదరంగం, క్యారమ్స్, తదితర ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, బావుల్లో పెద్దవాళ్ల తోడు లేకుండా ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై మోజుతో ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు చెప్పకుండా రోడ్లపైకి వెళ్తే ప్రమాదాల బారినపడే అవకాశం ఉంది. పాఠశాల నుంచి రాగానే కొందరు పిల్లలు సమయం దొరికిందని ఎండలో ఆటలాడుతుంటారు. దీంతో వడదెబ్బకు గురై ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
నీరు అధికంగా తాగాలి...
కొండలరావు (డీఎంహెచ్ఓ)
వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరు అధికంగా నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. పిల్లలు మధ్యాహ్నం పూట ఎట్టిపరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. ఎండల తీవ్రత అధికమైనప్పుడు పిల్లలు ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపరు. అందుకే పిల్లలకు పళ్ల రసాలు అందుబాటులో ఉంచడంతో పాటు నీరు ఎక్కువగా తాగేలా ప్రోత్సహిస్తే అనారోగ్యం బారినపడే అవకాశం ఉండదు.