Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26 నుండి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ మున్సిపాలిటీలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం నుండి రావలసిన ఏరియర్స్ ఈనెల 25 నాటికి చెల్లించాలని, లేనిపక్షంలో 26 నుండి నిరవధిక సమ్మె చేస్తామని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, బీఆర్టీయూ నియోజకవర్గ అధ్యక్షులు ఆవుట రవీందర్ తెలిపారు. సోమవారం నల్లగొండ మున్సిపాలిటీ ముందు భోజన విరామ సమయంలో ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 జూన్లో ప్రభుత్వం జీవో నెంబర్ 60 విడుదల చేసి 2021 జూన్ నుండి పెరిగిన వేతనాలను అమలు చేస్తామని చెప్పిందని తెలిపారు. అన్ని మున్సిపాలిటీలలో ఏరియార్స్ ఇచ్చినప్పటికీ నల్లగొండ మున్సిపాలిటీలో ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. వెంటనే పెండింగ్ ఏరియార్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎండాకాలం ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున పనివేలలు మార్పు చేయాలని, ఎండాకాలం వడదెబ్బలు తగలకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా తీసుకున్న పారిశుద్ధ్య కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపచేయాలని, హాజరు పాయింట్ల వద్ద, ట్రాక్టర్ షెడ్డు దగ్గర , డంపింగ్ యార్డ్ దగ్గర మంచినీరు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పెరిక కృష్ణ, ఎండీ. అబ్దుల్లా తీఫ్, పెరిక కళ్యాణ్, పేర్ల సంజీవ, పెరిక అంజమ్మ, వెంకన్న, లింగయ్య, శ్రావణ్ కుమార్, పూలమ్మ, ఎల్లమ్మ, బిక్షం, నాగుల కరుణ తదితరులు పాల్గొన్నారు.