Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాంపల్లి, మర్రిగూడ మండలాల ప్రజలు బందు పాటిస్తూ నిరసనలు
- అఖిలపక్షం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాలు
నవతెలంగాణ- నల్గొండ
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు నిర్ణయం అడ్డకత్తెరలో పోకచెక్క పరిస్థితిని తెచ్చిపెట్టింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మంత్రి హరీష్ రావు నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు 36 కోట్ల నిధుల కేటాయింపుతో ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసింది.అయితే ఆసుపత్రి ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఆసుపత్రి మంజూరు జీవోలో సైతం స్పష్టంగా పేర్కొనక పోయినప్పటికీ చౌటుప్పల్ లోనే దీన్ని ఏర్పాటు చేయాలని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిర్ణయించారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంగళవారం మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతో భూమి పూజకు ఏర్పాటు చేశారు.ఒకవైపు చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రికి భూమి పూజ సన్నాహాలు చేస్తుండగానే ఇంకోవైపు మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి, మర్రిగూడ మండలాల ప్రజలు ఎమ్మెల్యే నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమ, మంగళ వారాల్లో నాంపల్లి మర్రిగూడ మండలాల పాటిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారిగా అఖిలపక్షం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి ఆందోళన నిర్వహిస్తున్నారు. మర్రిగూడ, నాంపల్లిలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ తో ఆందోళన ఉధతం చేస్తున్నారు.అటు బీఆర్ఎస్ పార్టీలో సైతం 100 పడకల ఆసుపత్రి విషయంలో చౌటుప్పల్ ఏర్పాటు చేయాలని కొందరు, నాంపల్లి ,మర్రిగూడలో ఏర్పాటు చేయాలని మరి కొందరు వాదిస్తూ రెండుగా చీలిపోయారు. హైవేపై ఉన్న చౌటుప్పల్ పట్టణానికి అన్ని వైపులా ఇతర పట్టణాలు దగ్గరలోనే ఉన్నాయని, అక్కడికంటే మారుమూల ప్రాంతాలైన మర్రిగూడ, నాంపల్లిలలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే నాంపల్లి, మర్రిగూడ, చండూరు, గట్టుప్పల్, చింతపల్లి మండలాల ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని వాదిస్తున్నారు.ప్రసవాలు, ప్రమాదాల చికిత్సలకు, అత్యవసర వైద్యానికి 60 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి చౌటుప్పల్ కు చేరుకోవాల్సి వస్తుందని, తమకు అటు నల్గొండ, ఇటు చౌటుప్పల్, హైదరాబాద్ అన్ని దూరంగా ఉన్నాయని అందుకే మర్రిగూడ, నాంపల్లిలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.వెనుకబడిన ఫ్లోరైడ్ ఫీడిత ప్రాంతాలైన నాంపల్లి మర్రిగూడలను కాదని చౌటుప్పల్ లో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం ఏ విధంగా సమర్ధనీయం కాదని అఖిలపక్షాలు వాదిస్తున్నాయి. చౌటుప్పల్ లో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు నిర్ణయంపై నాంపల్లి మర్రిగూడ మండలాల ప్రజలు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు.వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుపై నియోజకవర్గం ప్రజల మధ్య విభజనతో పాటు అధికార బీఆర్ఎస్ పార్టీలోను విభజన నెలకొని వివాదాస్పదమైంది.