Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగుమతికి నిరాకరిస్తున్న మిల్లర్లు
- అదనపు భారమంటున్న డ్రైవర్లు
- కేంద్రాల్లో పెరుకుపోతున్న ధాన్యపురాశులు
- పైసలిస్తేనే కాంటాలు
- ఆందోళనలో అన్నదాతలు...!!
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు అమ్ముకునేందుకు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఈ సీజన్లో కష్టాలు మరింతగా పెరిగాయి. కష్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఈ సీజన్ గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. గత సీజన్లో తీసుకున్న బియ్యాన్ని పూర్తిస్థాయిలో మిల్లర్లు ఇంకా ప్రభుత్వానికి చెల్లించలేదు. పెండింగ్ బియ్యం చెల్లింపునకు ఈనెల చివరి వరకు అధికారులు గడువు పెట్టారు. అప్పుడే యాసంగి సీజన్ ధాన్యం చేతికి వచ్చింది. పంట కోసి 20 రోజులు పై దాటిన అమ్మకాలు చేసేందుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ సీజన్లో 1010 రకం ధాన్యాన్ని కొనుగోలు చేసి సీఎంఆర్ పెట్టెందుకు అధికారుల సిద్ధమవుతున్నారు. కానీ మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. సీఎంఆర్ ధాన్యం తమకు వద్దంటూ గతంలోనే అధికారులకు తేల్చి చెప్పారు. ఆయన అధికారులు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాల్సిందేనని గట్టిగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రధానంగా మిల్లర్లు సన్నరకం దానాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఇప్పుడు దొడ్డు రకం ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు స్థలం లేదని సాకు చెప్పి దిగుమతి చేసుకోకుండా దాటవేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే గోదాం వద్ద దిగుమతి చేయాలని సూచించడంతో గోదాములకు దూర భారం పడుతుందని అదనపు చార్జీలు చెల్లిస్తే దిగుమతి చేస్తామని డ్రైవర్లు చెబుతున్నారు. రోజు వందలాది లారీల ధాన్యం దిగుమతి చేసుకోవాల్సిన మిల్లర్లు పదో సంఖ్యలో మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో కేంద్రాల వద్ద ఎగుమతి లేక కొనుగోలు మందగించిపోతున్నాయి. దాని ఫలితంగా కాంటాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. వి నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు నత్తనడకంగా సాగుతున్నాయి.
నవతెలంగాణ -మిర్యాలగూడ
నల్గొండ జిల్లాలో 278 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 140 ఐకేపీ, పీఏసీఎస్ 138 కేంద్రాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి వస్తుందని అందులో ఎనిమిది లక్షలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు .జిల్లా వ్యాప్తంగా 109 మిల్లులకు సీఎంఆర్కు కేటాయించారు. మిర్యాలగూడలో 60 రైస్ మిల్లులు సీఎంఆర్కు కేటాయించగా కొత్తగా 14 రైస్ మిల్లు గుర్తించి వాటిని కూడా చేర్చారు. దీనితో మొత్తం 74 రైస్ మిల్లులు సీఎంఆర్ కింద ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 300 లారీలు ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్టు అధికారులు తెలిపారు. మిర్యాలగూడ పరిధిలో ఇప్పటివరకు 90 లారీల్లో ధాన్యాన్నే ఎగుమతి చేసినట్టు కేంద్రాల నిర్వహకులు తెలిపారు.
దిగుమతికు నిరాకరిస్తున్న మిల్లర్లు
కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు నిర్వాహకులు నానా తంటాలు పడుతున్నారు. కాంటాలు వేసిన దాన్ని ఎప్పటికప్పుడు గోనే సంచిలో నింపి ఏరోజుకారోజు లారీల్లో మిల్లులకు తరలించాలి. మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలి. కానీ పంటలు కోతలు ప్రారంభమైన నెల రోజులు అవసరంతో ఆయకట్టులో పెద్ద ఎత్తున సాగుచేసిన సన్న రకం ధాన్యాన్ని భారీగా కొనుగోలు చేశారు. ఆ ధాన్యాన్ని మిల్లులలో నిలువ చేసుకోగా, దొడ్డు రకం ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు స్థలం లేదంటూ నిరాకరిస్తున్నారు. దీంతో మిల్లుల వద్ద రోజు పదుల సంఖ్యలో లారీలు క్యూలో నిలబడి ఉంటున్నాయి. అధికారులు గట్టిగా ఒత్తిడి చేయడంతో ధాన్యపు బస్తాలను గోదాముల వద్ద దించాలని సూచిస్తున్నారు. మిల్లులకు గోదాముల మధ్య పది కిలోమీటర్ల దూరం వ్యత్యాసం ఉండడం వల్ల ఆ దూర భారం భరించలేమని డ్రైవర్లు పేర్కొంటున్నారు. అదనపు చార్జీలు చెల్లిస్తే దిగుమతి చేస్తామని డ్రైవర్లు చెబుతున్నప్పటికీ మిల్లర్లు నిరాకరించడం వల్ల ధాన్యం దిగుమతి నత్తనడకనగా సాగుతుంది.
పైసలు ఇస్తేనే కంటాలు...
పంట అమ్ముకునేందుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్ద ధాన్యపు రాశులతో పడిగాపులు కాస్తున్న కాంటాలు వేయించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై వారం రోజులు కావచ్చునప్పటికీ కొనుగోలు మాత్రం సోమవారం నుంచి ప్రారంభించారు. రోజువారీగా సీనియార్టీ ప్రకారం కేంద్రాల్లో రైతులకు టోకెన్లు ఇస్తున్నారు. దాని ఆధారంగా గోనె సంచులు అందిస్తున్నారు. కానీ కాంటాలు వేసే హమాలి ముఠాలు రైతుల వద్ద డబ్బులు తీసుకొని ప్రాంతాలు వేస్తున్నట్లు ఆరోపణ వినిపిస్తున్నాయి. ఎవరు రెండు మూడు వేల రూపాయలు ఇస్తే వారి కుప్పలు మాత్రమే కాంటాలు వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రోజుల తరబడి ధాన్యం రాశులతో పడిగాపులు కాస్తున్నామని కాంటాలు వేసుకునేందుకు గన్ని సంచులు ఇచ్చిన హమాలీలు డబ్బులు ఇవ్వని కారణంగా కాంటాలు వేయడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో రైతుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో హమాలీలను మందలించినట్లు సమాచారం.
మిల్ పాయింట్ వద్దకే ధాన్యం
డీిఎస్ఓ వెంకటేశ్వర్లు
మిల్లర్లు కచ్చితంగా సి ఎం ఆర్ ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. మిల్లు పాయింట్ వద్దనే ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలి. ధాన్యం దిగుమతి చేసుకోకుండా ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. మిల్లులో కొచ్చిన లారీలను ఎప్పటికప్పుడు ఏరోజుకారోజు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలి. మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకునేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కిందిస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచి అప్రమత్తం చేస్తున్నాం.
ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదు
లి పిఎసిఎస్ చైర్మన్ రామకృష్ణ
కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం తరలివస్తుంది. వచ్చిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకొని తేమ లేకుండా చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని సీనియార్టీ ప్రకారం గోనె సంచులు ఇస్తున్నాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల్లో ఎక్కిస్తున్నాం. కానీ మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదు. రోజు 30 లారీల ధాన్యం దిగుమతి చేసుకోవాల్సి ఉండగా కేవలం ఐదు, ఆరు లారీలు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల కొనుగోలుకు ఆలస్యమవుతుంది. కేంద్రాల్లో డబ్బులు ఇస్తేనే కాంటాలు కొన్ని విషయంపై ప్రధానంగా దృష్టి పెట్టాం. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం.