Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమయానికి అదనంగా ఐదు నిమిషాలే
- అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్తా
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ఈనెల 25 నుండి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్త సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పరీక్షలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వహించాలని సూచించారు. పరీక్ష సమయానికి ఐదు నిమిషాల అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్ష సిబ్బంది, అభ్యర్థులు ఎవరు కూడా సెల్ ఫోను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకు వెళ్లరాదని ఆదేశించారు. అనంతరం డీఈఓ బిక్షపతి మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతికి ఆరు కేంద్రాలు, ఇంటర్మీడియట్‌కు తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పదవ తరగతికి నల్లగొండలో రెండు, మిర్యాలగూడలో రెండు, దేవరకొండలో రెండు, ఇంటర్మీడియట్ పరీక్షకు నల్లగొండలో నాలుగు, మిర్యాలగూడలో మూడు, దేవరకొండలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్, ప్యాడ్, పెన్, పెన్సిల్‌ను తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు విధిగా ఐడి కార్డు ధరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ జగదీష్, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.