Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన ఉపవాస దీక్షలు
- ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
నవతెలంగాణ-సూర్యాపేట
శుభప్రద, పుణ్యఫలాల పవిత్ర రంజాన్ మాసంలో నెలరోజుల ఉపవాస దీక్షలు నేటితో ముగియనున్నాయి.శుక్రవారం నెలవంక కనిపించడంతో ముస్లిములు తమ ఉపవాసదీక్షలను విరమించారు.నెల రోజుల ఉపవాసదీక్షలు, నమాజులు, తరావి నమాజులతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.శనివారం జిల్లావ్యాప్తంగా ముస్లిములు ఈద్ఉల్ ఫితర్ (రంజాన్) ను ఘనంగా జరుపుకోనున్నారు.ప్రత్యేక నమాజుల కోసం జిల్లాలోని 250 మజీదులో 70 ఈద్గాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు.
తఖ్బీర్ పట్టించాలి
ఈదు నమాజ్ కోసం ఈద్గాకు వెళ్లేటప్పుడు అల్లాహు అక్బర్- అల్లాహు అక్బర్,లాయి లాహా ఇల్లల్లాహు వల్లాహు, వల్లాహు అక్బర్- అల్లాహు అక్బర్ వల్లీల్లా హిల్ హాందు అని తఖ్బీర్ ను తప్పసరిగా పఠించాలి.అంతేకాక ఈద్గాకు వెళ్లేటప్పుడు ఒక దారిన వెళ్లి వచ్చేటప్పుడు మరో దారిలో రావడం ఉత్తమం.అది కూడా కాలినడకన వెళ్లి రావడం అధిక పుణ్యం లభిస్తుంది.పురుషులతో పాటు పిల్లలు ఈద్గాకు వెళ్ళి ఈద్ నమాజ్‌లో పాల్గొనడం సున్న తని మతపెద్దలు పేర్కొంటున్నారు.
ఈదుల్ఫితర్ నమాజ్ ప్రత్యేకం
మిగతా రోజుల కంటే ఈదుల్ ఫితర్ నమాజ్ ప్రత్యేక సమయంలో చేస్తారు.సూర్యుడు ఉదయించిన రెండు,మూడు గంటల తర్వాత నమాజును ప్రారంభిస్తారు.ఈదుల్ఫితర్ నమాజ్‌కు ముందుగానీ, తర్వాతగానీ ఎలాంటి సున్నత్ నమాజులు చేయరాదు.ఇమాం ఈదు ఉల్ పీతర్ నియమాలు వివరిస్తారు.నమాజు అనంతరం ఖుదుబా పఠిస్తారు.
పాటించాల్సిన నియమాలు
ఫిత్రా దానం నమాజ్ కంటే ముందే చెల్లించాలి.అనంతరం ఈద్గాకు వెళ్లాలి.పండగ రోజు కొత్త బట్టలు లేదా ఉన్నవాటిలో మంచి దుస్తులు ధరించాలి.నమాజ్ కంటే ముందు ఏదైనా షీరు?ర్మా (సేమ్యా) లేదా తీపి పదార్థం తిని బయల్దేరడం మహమ్మద్ ప్రవక్త (స.అ.స) సంప్రదాయంగా వస్తుంది.నమాజ్ కంటే ముందే ఈద్గాకు చేరుకోవాలని నమాజ్ కోసం అజాన్,అఖమతు చెప్పనవసరం లేదు.పండగ నమాజ్‌కు వెళ్లలేని వారు వృద్ధులు కూడా ఏదేని కారణం చేత ఈద్గాకు వెళ్లకపోయినా వారు ఒంటరిగానే రెండు రకాతుల నమాజు చేసుకోవాలి. ఒకవేళ వర్షం కురిసినట్టయితే మజీదులలో నమాజ్ చేయొచ్చు.పండుగ రోజు ఉపవాసం( రోజా) నిషిద్ధమని మతపెద్దలు పేర్కొంటున్నారు .నమాజు పూర్తయిన తర్వాత పరస్పరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడం అనవాయితీగా వస్తుంది.
ప్రవక్త సూచనలు
విజ్ఞాన అన్వేషణలో ఎంత దూరమైనా వెళ్లండి భూమి చివరి కైనా వెళ్ళండి కానీ జ్ఞానాన్ని ఆర్జించిండని ప్రవక్త చెప్పడం జరిగింది. మీరు చెడును చూస్తే చేతితో ఆపండి అదికాకపోతే నోటితో ఆపండి అది వీలు కాకపోతే మనస్సులోనే అసహ్యించుకోవాలని ప్రవక్త సూచిస్తున్నారు. అదే విధంగా ఈర్ష్యకు దూరంగా ఉండాలని నిప్పు కట్టెలను కాల్చినట్లు ఈర్ష్యా సత్కార్యాలను భస్మీపటలం చేస్తుందని పేర్కొన్నారు. హింసా దౌర్జన్యాలు పరిష్కార మార్గాలు కానే కావని ప్రగతికి మన ఉనికికి ప్రమాదాలని హెచ్చరించారు. మంచికి దైవభక్తికి సంబంధించిన పనుల్లో అందరితో సహకరించాలని పాప కార్యాల్లో అత్యాచారాల్లో సహకరించవద్దని సూచించారు.
జిల్లాలో ఏర్పాట్లు పూర్తి
రంజాన్‌కు జిల్లాలోని పలుచోట్ల మజీద్లు ఈద్గాలు అలంకరించారు.జిల్లాలో దాదాపుగా 200కు పైగా మసీదులు ఉన్నాయి.అదే విధంగా ఈద్గాలు కూడా 70 కు పైగా ఉంటాయి.ముస్లిములు పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు .ప్రార్థనల్లో ముస్లిములుపెద్ద ఎత్తున పాల్గొనున్నారు.ఇందుకుగాను ప్రత్యేక ఏర్పాట్లను కమిటీ వారు నిర్వహిస్తున్నారు.అదేవిధంగా ప్రభుత్వపరంగా అన్ని ఈద్గాలలో షామియానాలు నీటి వసతి లాంటి పలు ఏర్పాట్లను చేస్తున్నారు.ప్రధానంగా ఖమ్మం క్రాస్‌రోడ్‌లో గల ఈద్గా వద్ద విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మంజూరు చేసిన రూ.60 లక్షల నిధులతో ఈద్గాలో నమాజ్ చేసుకునే ప్రాంతాన్ని మొత్తం సిమెంట్‌తో ఫ్లాట్ ప్లాట్‌ఫాం నిర్మించారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫ్లాట్‌ఫాం నిర్మాణం జరగడంతో ముస్లిములకు నమాజ్ సమయంలో ఎదురయ్యే సమస్యలు తొలగనున్నాయి.ఇదిగాక పురపాలక సంఘం వారు ఆధ్వర్యంలో షామియానాలు కుర్చీలు నీటి వసతి తదితర ఏర్పాట్లను చేస్తున్నారు.ఈద్గా అన్ని హంగులతో ముస్తాబు అవుతుంది. అదే విధంగా జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో జనగామ క్రాస్ రోడ్డు నుండి ఈద్గా వరకు పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు.నేటి ఈదుల్ ఫితర్ పండుగ నమాజ్‌కు ఈద్గా వద్దకు మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు అన్ని పార్టీలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.ఈసందర్భంగా ముస్లిం సోదరులతో ఒకరిరొకరు ఆలింగం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
రంజాన్ పవిత్ర మాసం.. అక్తర్ మౌలానా.
రంజాన్ పవిత్ర మాసం అని ఉపవాస దీక్షలు చేపట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది.ఎంతో పుణ్యం లభిస్తుంది.మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రార్థన ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది.పండుగ పవిత్రత తెలుస్తుంది.భక్తిభావం అందడంతో పాటు నిష్టగా దీక్షలు చేస్తే కోరికలు నెరవేరుతాయి.300 రోజుల పాటు ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరుల పాపాలు ప్రక్షాళన కావడంతో పాటు నీతి నిజాయతీతో కూడిన జీవితాన్ని గడుపుతారు.అల్లా కూడా రంజాన్ మాసంలో భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తారు.ఎంతో పవిత్రతో కూడిన మాసం శుక్రవారంతో ముగిసింది.శనివారం జరిగే రంజాన్ పండుగ సందర్భంగా జనగాం క్రాస్‌రోడ్డు వద్ద గల ఈద్గాలో జరిగే ఈద్ఉల్ ఫితర్ నమాజ్‌లో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞాప్తి చేశారు.