Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటాలు చేయడమే ఆయనకు అర్పించే నివాళి
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
నవతెలంగాణ -నల్లగొండ కలెక్టరేట్
ఉన్నత వర్గంలో పుట్టి, ఉన్నతమైన చదువులు చదివి అట్టడుగు వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన నేత సునీత్ చోప్రా అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య అన్నారు. మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా విస్తృత సమావేశాల సందర్భంగా సంఘం జాతీయ సహాయ కార్యదర్శి సునీత్ చోప్రా సంతాప సభ జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టాన్ని , గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పై భూమి, కూలి పోరాటాలను ఉధృతంగా నిర్వహించడమే సునీత్ చోప్రా కు అర్పించే నిజమైన నివాళి అవుతుందన్నారు. చిన్న వయస్సులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో ఆకర్షితుడై ప్రజా ఉద్యమాల్లోకొచ్చిన సునీత్ చోప్రా ఢిల్లీ, కలకత్తా, లండన్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించారని ఢిల్లీ జేఎన్ యూ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ని నిర్మాణం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. జలంధర్ లో జరిగిన డివైఎఫ్ఐ మహాసభలో మొదటి ట్రెజరర్ గా ఎన్నికయ్యారని 1986 పాలఘాట్ లో జరిగిన అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం రెండో మహాసభ నుండి మొన్న బెంగాల్లో జరిగిన అఖిలభారత్ పదవ మహాసభ వరకు వివిధ బాధ్యతల్లో పనిచేశారని కొనియాడారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీలు జరిపిన అనేక భూ పోరాటాలు, కూలి పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని పేర్కొన్నారు.కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను కార్పొరేట్ బహుళ జాతి కంపెనీలకు అప్పనంగా ఇస్తుందని విమర్శించారు. ఉపాధి హామీ నిధులను గత సంవత్సరం కేటాయించిన లక్ష కోట్ల నుండి 60 వేలకోట్లకు బడ్జెట్ కుదించిందని ఆధార్ కార్డు, జాబ్ కార్డు, బ్యాంక్ ఎకౌంటు, ఆన్లైన్ అనుసంధానం పేరుతో కోట్లాదిమంది పేదల పనిని తగ్గించి వేసిందన్నారు. తక్షణం ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోడు, సాగుదారులకు నాలుగు లక్షల మందికి హక్కు పట్టాలు సిద్ధం చేశామని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే సాగులో ఉన్న ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేదలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు దండంపల్లి సరోజా,కత్తుల లింగ స్వామి, పిల్లుట్ల సైదులు, రవి నాయక్, జిల్లా నాయకులు గండమల్ల రాములు,మన్యం బిక్షం,ఉడుగుండ్ల రాములు, చింతపల్లి లూర్ధుమారయ్య,పూలమ్మ,బొంగరాల వెంకటయ్య,రెమిడాల బిక్షం, కందుకూరి రమేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.