Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత గోనె సంచులతో నష్టం వాటిల్లే ప్రమాదం
- రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తీసుకున్న భూమి లీజు ఖర్చులను రైతుల వద్ద బస్తకు రూపాయి చొప్పున వసూలు చేయడం సరైనది కాదని, దీనిని సహించేలేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మురెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు గ్రామపంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులు, కొనుగోలు నిర్వాహకులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూమిని లీజుకు తీసుకున్న డబ్బులను కొనుగోలు చేసే నిర్వాహకులే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు ధాన్యం విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకుండా వారాల తరబడి రైతులను రాశుల వద్ద పడిగాపులు కాపించే విధంగా తాలు , తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది గురుచేయకుండా తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు సమయంలో వేసే తూకాలంలో ప్రభుత్వం నిబంధనలను పాటించకుండా అదనపు తూకాలను వేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే గోన సంచులతో రైతులకు నష్టం ఏర్పడే ప్రమాదం ఉందని, పాతవి కాకుండా కొత్త గోన సంచులను తీసుకురావాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన ధాన్యం అకాల వర్షాల కారణంగా తడిసిన మొలకెత్తిన కలర్ మారిన ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద సీపీఐ(ఎం) బృందానికి తెలిపిన సమస్యలను పరిష్కరించేందుకు ఫోన్ ద్వారా స్థానిక తహసీల్దార్ కృష్ణారెడ్డికి వివరాలను వెల్లడించారు. తాసిల్దార్ సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం, మునుగోడు సర్పంచ్, సీపీఐ(ఎం) మండల నాయకులు మిర్యాల వెంకన్న, మండల కార్యదర్శి మిర్యాల భరత్, సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు, యాసరాని శ్రీను, వేముల లింగస్వామి, చివర్ల వీరమల్లు, సాగర్ల మల్లేష్, కొంక రాజయ్య తదితరులు పాల్గొన్నారు.