Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్్ జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ -కోదాడరూరల్
వేలాది మంది పూర్వవిద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల చేత బాలాజీనగర్ గ్రామచరిత్ర లిఖించబడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. గురువారం పట్టణ పరిధిలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ''మనఊరు- మనచరిత్ర'' పై జరిగిన అవగాహనా కార్యక్రమంలో జూలూరు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. . 1964లో ప్రారంభించబడిన కేఆర్ఆర్ కాలేజి తూర్పు నల్లగొండ జిల్లాకు విద్యాకేంద్రంగా భాసిల్లిందని ఆయన గుర్తు చేశారు. ఆ గ్రామచరిత్రను, ఆ గ్రామంతో తమకు ఉన్న అనుబంధాన్ని బాలాజీ నగర్ గ్రామచరిత్ర రాస్తున్న విద్యార్థులకు తెలియజేసి రచనలకు సహకరిస్తామని గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు ముందుకువస్తున్నారని తెలిపారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో అత్యధికమంది గిరిజనులు చదువుకున్న గ్రామంగా బాలాజీనగర్ చరిత్రకెక్కిందన్నారు. బాలాజీనగర్ ఊరు పుట్టుక, ఊరిలోని ఆర్థిక సాంస్కృతిక సంబంధాలను ఈ తరం విద్యార్థులు చరిత్రగా లిఖించ బోతున్నారన్నారు. బాలాజీనగర్ కు వన్నె తెస్తూ కేఆర్ఆర్ కాలేజీ నిర్వహించిన పాత్ర కళాశాల యాజమాన్యం కృషిని, ప్రముఖ వ్యక్తుల పాత్రను చరిత్రగా రాయబోతున్నారన్నారు. గత ఆరుదశాబ్దాలుగా ఆ కళాశాలను తీర్చిదిద్దిన ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకుల పాత్ర, వేలాది మంది విద్యార్థుల విజయగాథలు నమోదు చేయబోతున్నారని చెప్పారు. ఈ కళాశాల మైదానంలో చైతన్యవంతమైన ఎన్నో విద్యార్థి సంఘాలు, వాటి చైతన్యం అవి ప్రజాస్వామ్యానికి అందించిన శిక్షణగా ఎలా మారాయో చరిత్రలో పేర్కొనబోతున్నారని తెలియజేశారు. బాలాజీ నగర్ గ్రామచరిత్ర రచనలో కళాశాల ప్రిన్సిపాల్ నలభై మంది అధ్యాపకులు విద్యార్థులు పాలుపంచుకుంటామని ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. బాలాజీ నగర్ లోని కేఆర్ఆర్ కాలేజీ చరిత్ర రాష్ట్రంలోని అన్ని కళాశాలల చరిత్రకు, ప్రఖ్యాతి వహించిన విద్యాసంస్థల చరిత్రకు ఒక టార్చిలైటుగా మిగులుతుందని అన్నారు. ఈ అవగాహనా సభకు అధ్యక్షత వహించిన కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.నాగు మాట్లాడుతూ'మన ఊరు మన చరిత్ర' ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి చేస్తామని, కళాశాల అభివృద్దికోసం, విద్యార్ధుల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. సీనియర్ పాత్రికేయుడు హరి కృష్ణ మాట్లాడుతూ స్థానిక చరిత్ర ప్రాముఖ్యం గురించి చెప్పారు. ఎన్నో ఉద్యమాలకు ఈ కళాశాల కేంద్రంగా ఉండేదన్నారు.'మనఊరు మన చరిత్ర' సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ డా.నందిగామ నిర్మల కుమారి మాట్లాడుతూ 'మన ఊరు మన చరిత్ర' అంటే మన మూలాలను మనం వెతుక్కోవడమేనని, చరిత్రను నమోదు చేయడం భావి తరాలకు ఎంతో అవసరం అని అన్నారు. అధ్యాపకుడు వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 'మనఊరు మనచరిత్ర' అన్న కార్యక్రమం నూతన చరిత్రకు తలుపులు తెరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో మాధవి, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డా నోముల వెంకటేశ్వర్లు, అధ్యాపకులు సత్యవాణి, శ్రీదేవి, సైదులు, జీ ఎల్ ఎన్ రెడ్డి, నరసింహ,రాజు.సుమలత,నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.