Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఆలేరు పట్టణంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లో కుప్పలుగా పోసిన వరి ధాన్యం తడిసింది.అకాల వర్షంతో ధాన్యం తడవగా రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తడిసిన ధాన్యం కారణంగా రైతులు దిగాలు చెందుతున్నారు. ఇటీవల రాళ్ల వాన రైతులను అవతల కులం చేసింది.ఆరుగాలం కష్టపడి పంట వ్యవసాయ మార్కెట్కు తీసుకువస్తే కాంటాలు వెంటవెంటనే పెట్టని జాప్యం కారణంగా ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. దాదాపు 15 వేల బస్తాల వరకు కుప్పలుగా మార్కెట్లో ఉన్నట్లు తెలుస్తుంది. మండలంలోని వందల ఎకరాల్లో వరి చేలు ఇంకా కోయాల్సి ఉంది. వర్షం కారణంగా కొంత వరిపంట నేలకొరిగింది. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించి వారం పది రోజులు గడుస్తున్నప్పటికీ హమాలీల, లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోలు వేగవంతం కాలేదు. ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్రెడ్డి హమాలీలకు, కార్మికులకు అందుబాటులో ఉండాలని కోరుతున్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
రైతు నాయకులు- ఎగిడి మల్లయ్య
అకాల వర్షం కారణంగా రైతుల కల్లాలో వరిధాన్యం పెద్దఎత్తున తడిసింది.వడ్లు తడవడంతో నల్లగా మారుతున్నాయి.ముక్కిపోయి మొలకలు వస్తున్నాయి. మార్కెట్లో వడ్లు వస్తే ఎక్కడ కుప్పలు అక్కడే ఉన్నాయి.తడిసిన ధాన్యంతో రైతులు అల్లాడుతూ దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.వెంటనే తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి.రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సైతం సహకరించాలి.వందలో 90 శాతం ధాన్యం తడిసి ముద్ధైంది.