Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడప్పుడు కాకుండా నిరంతరం కొనసాగించాలి
- ముఖ్యమంత్రి న్యాయం చేయాలి
- పీఎంఓల వేడుకోలు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
పేదింట్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అప్పుడప్పుడు కాకుండా నిరంతరం కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో తమకు అవకాశం కల్పించి కంటి వెలుగును కొనసాగించాలని పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్లు (పీఎంఓ)లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 31తో పూర్తి అవుతుండడంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని, పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో తమను కొనసాగించాలని పారామెడికల్ అత్తమాలిక్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ నుండి ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్లగొండ జిల్లా నుండి సుమారు 60 మందికిపైగా పీఎంఓలు ర్యాలీకి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు పీఎంవోలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం తమను గుర్తించలేదని కేవలం తెలంగాణ ప్రభుత్వమే తమను గుర్తించిందని పేర్కొన్నారు. దేశం గర్వించే విధంగా తెలంగాణ వైపు చూసేలా కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని, అందులో తమను భాగస్వామ్యం చేయడం మాహభాగ్యంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇంతటి సదవకాశాన్ని తమకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కంటి వెలుగుతో ఎందరో పేదల జీవితాలలో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కంటి వెలుగుకే తమను పరిమితం చేయకుండా పిహెచ్‌సిలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో కొనసాగిస్తూ పీఎంఓల జీవితాలలో కూడా వెలుగులు నింపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడం ద్వారా తమతోపాటు ప్రజలకు న్యాయం చేకూర్చిన వారు అవుతారని, దీంతో అందత్వ రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతుందని అన్నారు. ఎవరు గుర్తించని తమను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా యూనియన్ తరపు నుండి నల్లగొండ యూనియన్ ప్రెసిడెంట్ వల్లంకి శ్రీను, సునీల్‌బాబు, సత్యనారాయణ, దేవినాయక్, మాజీద్, జానయ్య, మహేష్, అనిత, ప్రశాంతి, ఆరోగ్య శ్రీహరి, గణేష్, వసీం, తదితరులు పాల్గొన్నారు.