Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జనార్దన్
యాదగిరిగుట్టరూరల్:బంగారు తెలంగాణలో, కేంద్ర మోడీ అచ్చేదిన్ పాలనలో రైతుల బలవన్మరణాలు ఎందుకు ఆగడం లేదని, రైతులు ఆత్మ-హత్యలు చేసుకోవడమే బంగారు తెలంగాణ,అచ్చేదిన్ పాలకుల విధానమా అని కేంద్ర మోడీ,రాష్ట్ర కేసిఆర్ ప్రభుత్వాలను ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్దన్, అఖిల భారత రైతు.కూలీ సంఘం (ఏ ఐ కే ఎం ఎస్) జిల్లా ఉపాధ్యక్షుడు బర్మ బాబులు ప్రశ్నించారు.యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఆదివారం ప్రపంచ కార్మిక వర్గ పోరాటదినం 137 వ, మేడే(వారోత్సవాలు)ను సందర్భాన్ని పురస్కరించుకుని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు కర్రె పాండరి జండాను ఎగురవేశారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో జనార్ధన్,బాబులు పాల్గొని మాట్లాడుతూ, మార్చి, ఏప్రిల్ మాసాలలో కురిసిన అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన వరి పంట మొత్తం తడిసి ముద్దైందన్నారు. లక్షల రూపాయలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద మిత్తీలు తెచ్చి, కుటుంబం మొత్తం కష్టపడి పంట తీస్తే, ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల అతివృష్టి, అనావృష్టి వలన రైతులు ఆర్థికంగా దివాలాతీసి, అప్పులపాలై, పంట నేలపాలైన స్థితిని చూసిన రైతు ఊపిరి తీసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మెట్టిపల్లి,సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్,నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మన గ్రామాలలో పంట దిగుబడి కోసం చేసిన అప్పులు కుప్పై, వర్షం మూలంగా నాశనమైన వరి పంట ను చూసిన రైతుల గుండె వడ్ల కుప్పల మధ్యనే ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, సబ్సిడీల రద్దు, అధిక ఎరువుల ధరలు రైతును ఆగం చేస్తుంటే, రైతుకు కనీస మద్దతు ధరలు లేక అప్పుల పాలైన పరిస్థితులలోనే ఈ ఆత్మహత్యలను, రైతుబంధు, పీఎం కిసాన్సమ్మాన్నిధి యోజన పథకాలేవీ రైతు ఆత్మహత్యలను ఎందుకు ఆపలేక పోతున్నాయో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు, రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి బేజాడికుమార్, ఏఐకేఎంఎస్ నాయకులు మోటే అంజయ్య, కారింగుల స్వామి, కర్రె లక్ష్మి, కళ్లెం బాలనర్సయ్య, చిక్కుడు రాజు, కారింగుల పెంటమ్మ, కె.నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.