Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర కార్యదర్శినారి ఐలయ్య
నవతెలంగాణ -చిట్యాల
ఉపాధి హామీ కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్ల, తాళ్ల వెల్లంల గ్రామాలలో పనిచేసే ఉపాధి కూలీల వద్దకు సోమవారం నాడు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల పనులను అధికారులు సరైన రీతిలో పర్యవేక్షించకపోవడం వల్ల సమస్యలు పేరుకుపోయాయని , గతంలో ప్లేసిప్పులు ,మస్టర్స్ ఇచ్చేవారని ,ప్రస్తుతం అవి ఇవ్వకపోవడంతోపాటు 20 మందికి ఒక మేటు ఉండే సౌకర్యాన్ని తీసివేయడం వల్ల కూలీల సమస్యలను పేరుకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మే నెలలో ఉపాధి పనులకు కొలతలు తీసివేయాలని కోరారు. వ్యవసాయంలో యంత్రాలు రావడం వలన కూలీలకు పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు వారానికి ఒకసారి బిల్లులు ఇవ్వాలని నిబంధన ఉన్నా, ఐదు,ఆరు వారాలకు పైగా బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కూలీలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులు ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతంగా చేయవలసి వస్తుందని ఐలయ్య హెచ్చరించారు .అనంతరం అనంతరం ఉరుమడ్ల, తాళ్ళవెల్లంల గ్రామాలలో ఉపాది హామీ కూలీల గ్రామ కమిటీ లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ సర్పంచ్ జిట్ట నగేష్ వివిధ ప్రజాసంఘాల నాయకులు ఐతరాజు నరసింహ, గోపగోని కవిత, బత్తుల పద్మ ,జనగాం శారద, కొమ్మగొని సరిత ,నల్లబెల్లి రేణుక, అరుణ ,యాదయ్య, వెంకన్న, రమేష్ పాల్గొన్నారు.