Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి నారీ ఐలయ్య
నవతెలంగాణ-నల్లగొండ
ఉపాధి హామీలో పనిచేసిన కార్మికులకు సంవత్సరాల తరబడి వేతనాలు రాకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారీ ఐలయ్య తెలిపారు. బుధవారం తిప్పర్తి మండలంలోని మామిడాల, గోదావరి గూడెం గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ డబ్బులను బడ్జెట్లో కుదించడం మూలంగా చేసిన పనులకు సంవత్సరాల తరబడి వేతనాలు రావడం లేదని వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజురోజుకు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వలన వ్యవసాయ పేదలపై ఆర్థిక బారాలు పడుతున్నాయని, దీని మూలంగా పేదల బ్రతుకులు గడవడం ఇబ్బందిగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి కార్మికుల దిన కూలి 600 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీలు పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారంగా 272 రూపాయలు ఎక్కడ కూడా పడడం లేదని 100 రూపాయలకు మించి రావడం లేదని తెలిపారు. కనీస సౌకర్యాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కొత్తగా రెండు పూటలా పనిచేయాలని అలాగే రెండుసార్లు ఫోటోలు తీయాలని విధానం తీసుకురావడం మూలంగా ఎక్కువసేపు పని అయిపోయిన అడవుల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని దీని ఫలితంగా కూలీలు ఎండలో ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఈ విధానం తీసివేయాలని డిమాండ్ చేశారు. ఉపాధిని కార్మికులకు దూరం చేయాలని ఉద్దేశంతోటే కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగులో ఉన్న బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలేసి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మన్నే బిక్షం, గండమల్ల రాములు, ఫీల్డ్ అసిస్టెంట్ బుల్లెద్దు పరశురాములు, శ్రీనివాసు, వ్యవసాయ కార్మిక సంఘం సంఘం మామిడాల గ్రామ అధ్యక్షులు గజ్జి లింగయ్య, కార్యదర్శి కల్లేపల్లి మాధవి, గోదావరి గూడెం గ్రామ అధ్యక్షులు గోదా రవీందర్ రెడ్డి, కార్యదర్శి నేలపట్ల మంగమ్మ, సంఘ నాయకులు కోడల సైదుబాబు, మునుగోడు లక్ష్మి, వైద్యపు రమేష్, సావిత్రమ్మ, బంటు సైదులు, దాచే బిక్షం, శ్రీనివాస్ రెడ్డి, బంగారక్క కవిత, బొల్లెద్దు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.