Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13వ రోజుకు చేరిన జీపీ కార్యదర్శుల నిరసన
- స్పందించని ప్రభుత్వం
- పంచాయతీల్లో కుంటుపడుతున్న అభివద్ధి
- వసూలు కాని ఆస్తి, నల్లా పన్నులు
- పేరుకుపోతున్న దరఖాస్తులు
- ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం
- ఇబ్బందిపడుతున్న ప్రజలు
- డిమాండ్లు పరిష్కరించేవరకు విరమించేది లేదంటున్న సిబ్బంది
తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. 13 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం. కనీసం వారితో చర్చలు జరిపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్ర వ్యాప్తంగా 9355, నల్లగొండ జిల్లాలో 730 మంది కార్యదర్శులు విధులు బహిష్కరించి సమ్మెలో ఉన్నారు. వీరి సమ్మెతో గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవ్వడంతో పాటు అభివద్ధి పనులు ముందుకు సాగడం లేదు.కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీలో కార్యదర్శి ఉండాలనే ఆలోచనతో 2018లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసింది. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ప్రొబెషనరీ పీరియడ్ 2 సంవత్సరాలు, కాగా, వీరికి మాత్రం మూడేండ్ల గడువుతో విధుల్లోకి తీసుకున్నారు. ప్రొబెషనరీ సమయంలో ప్రతి నెలా రూ.15 వేలు ఇచ్చారు. 2021 ఏప్రిల్‌లో ప్రొబెషనరీ పిరియడ్ పూర్తి అయ్యే ఆరు మాసాల ముందు మరో సంవత్సరం ప్రొబెషనరీ పిరియడ్్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగేండ్ల పీరియడ్ 2022 ఏప్రిల్ 12తో పూర్తి కాగా రూ.15 వేలు ఉన్న హనరోరియం రూ.28,719 పెంచిన ప్రభుత్వం సర్వీసు రెగ్యులరైజ్ చేయడాన్ని విస్మరించింది.హనరోరియం పెంచి రెగ్యులరైజ్ చేసే విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌తో గత నెల 13న కార్యదర్శులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఏప్రిల్ 27 వరకు ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్‌ను పరిష్కరించకుంటే నిరవదిక సమ్మెకు వెళతామని తెలిపారు. ఏప్రిల్ 13 నుంచి 27 వరకు ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ నిరసన కార్యక్రమాలు చేశారు. మంత్రులు కేటీఆర్‌ను, ఎర్రబెల్లి దయాకర్‌రావును, హరీషరావును పలువురు ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ క్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ కమిషనర్ వీరిని చర్చలకు పిలిచి సమ్మె చేయవద్దని కోరారు. తమ డిమాండ్‌ను పరిష్కరించకుండా సమ్మె చేయవద్దని హెచ్చరించడంతో విధిలేని పరిస్థితిలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు పూనుకున్నారు. 13 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరి గోడును ప్రభుత్వం పట్టించుకునే ప్రయత్నం సైతం చేయకపోవడం గమనార్హం.
పట్టించుకోని ప్రభుత్వం ముందుకు సాగని పనులు
జిల్లాలో 844 పంచాయతీల కార్యదర్శులుగా పనిచేస్తున్నారు. సమ్మెలో 730 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలో ఉన్నారు. ప్రస్తుతం 844 పంచాయతీలకు కేవలం 114 మంది పర్మినెంట్ కార్యదర్శులు పని చేస్తున్నారు. ప్రతీ ఒక్కరికి రెండు, మూడు పంచాయతీల ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంతో ఏ గ్రామానికి సరైన విధంగా సేవలు అందించలేని దుస్థితి నెలకొంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు బర్త్, డెత్ సర్టిఫికెట్స్‌తో పాటు గ్రామాల్లో జరిగే ప్రతీ అభివద్ధి కార్యక్రమాల బాధ్యతలు నిర్వహిస్తుంటారు. కరోనా సమయంలో వీరు కరోనా సర్వే విధులు, ప్రస్తుతం కంటి వెలుగు విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. వీరంతా విధులు బహిష్కరించి సమ్మెలో ఉండడంతో గ్రామాల్లో పనులు ముందుకు సాగడం లేదు. కనీసం పారిశుధ్య కార్యక్రమాలు సైతం నిర్వహించలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో ధాన్యం సేకరణ బాధ్యతలు సైతం కార్యదర్శులకు అప్పగించడంతో వీరి సమ్మె ఇబ్బందిగా మారింది. గ్రామాల్లో సర్పంచ్‌లు సైతం వీరి డిమాండ్ పరిష్కరించాలని సంఘీభావం తెలుపడం విశేషం. ప్రతిపక్షాల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వరకు మద్దతు లభిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం వెంటనే సమ్మె విరవింప చేయాలి. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న గ్రామపంచాయతీ కార్యదర్శులు వెంటనే క్రమ భర్తీకరించాలని కోరారు. 2019 ఏప్రిల్ నుండి వివిధ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నారని నోటిఫికేషన్ ప్రకారం వీరి ప్రోహిబియేషన్ కాలం గత 2022 ఏప్రిల్ నాటికి పూర్తి అయిందని పేర్కొన్నారు. అయినా మరొక సంవత్సరం గడువు పెంచినప్పటికీ ఆ గడువు కూడా 11 ఏప్రిల్ 2023 తో పూర్తయిందన్నారు. ఇప్పటికైనా వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని కోరారు.
రెగ్యులరైజ్ చేసే వరకు వెనక్కు తగ్గేది లేదు
తంగేళ్ల ఉపేందర్ రెడ్డి. జేపీఎస్‌ల జిల్లా కోఆర్డినేటర్
తమ ప్రధాన డిమాండ్ అయిన సర్వీసు రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదు. చాలా డిపార్ట్మెంట్లలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం పరీక్ష రాసి ఉద్యోగంలో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను విస్మరించడం బాధాకరం. మా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడం లేదు. మేము సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తే అవకాశం ఇవ్వడం లేదు. మంత్రుల నుంచి స్పందన లేదు. మా సర్వీసు రెగ్యులరైజ్ చేస్తామని, మరణించిన కార్యదర్శుల కుటుంబాలకు రూ.20లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలి. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుంది.