Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీథి చివరన...
ఆ సైకిల్ గంట గణగణ శబ్దం...
వెనువెంటనే వినవచ్చేఁపోస్ట్ఁ
అన్న కేక వింటే చాలు...!
కిటికీ చాటున కళ్ళల్లో
కోటి ఆశల అంకురాలు...
వాకిట్లో వేచివున్న హృదయాలలో
సంతోషాల చిగురింతలు...!!
మనీ ఆర్డర్ అందుకున్న నిరుద్యోగి
ముఖంలో కొత్త కాంతులు...
టెలిగ్రామ్ అందుకున్న చిరుద్యోగి
గుండెల్లో గుబులు...!!!
దేశాంతరం వెళ్లిన తనయుని క్షేమ సమాచారం
అందుకున్న తండ్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలు...
వల్లభుని ప్రేమలేఖ అందుకున్న ఆషాఢపు
పెళ్లికూతురి వదనంలో నునుసిగ్గుల
పరవశాల దొంతరలు...!!!!
ప్రేమకావ్యాలు,చారిత్రక సత్యాలు...
అనుబంధాలు,స్నేహబంధాలు...
ఆనందాలు,ఆవేదనలు...
విరహాలు,శుభవార్తలు...
అభినందనలు,అశుభాలు...
మరెన్నో పొదువుకున్న అక్షర లేఖలను...
అన్నిటినీ ఆ సంచీలో మోస్తూ...
ఎండకి ఎండుతూ...
వానకి తడుస్తూ...
ఇల్లిల్లూ,వీథి వీథి తిరుగుతూ...
చిరునవ్వుతో అందరికీ అందిస్తూ...
అందుకొన్న వారి మోములో
చిరునవ్వులు పూయిస్తూ...
అందరికీ ఆప్తబంధువైన...
నాటి తరం చిరుద్యోగి...
తపాలా బంట్రోతు...!!!!!!!!
-- చంద్రకళ. దీకొండ
స్కూల్ అసిస్టెంట్,
మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లా
9381361384