Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊరిసామెతలు
లోకం మీద ఒకరికొకరు మంచిచెడు సలహాలు ఇచ్చుకోవడం రివాజు. వద్దురా నాయినా చేయకు, తప్పుల పడతవు అంటే 'పెద్దవారి మాట సద్దిమూట' అని అర్థం చేసుకుని మానుకుంటరు. మరికొందరు అట్లనే చేసుకుంట పోతరు. వాల్లని చూసి 'చెప్పంగ విననోన్ని చెడంగ చూడాలె' అంటరు. ఊర్లల అనుభవం ఉన్నవాల్లు ఉండే వుంటరు. వాల్లు తమ దగ్గర వాల్లకు చెప్పుతరు. అందులో కొందరు పెగసరివాల్లు వినరు. వాల్లు చెడిపోతరు అంటరు. ఇంక ఇటువంటి వాల్లు ఎదురు జవాబు ఇస్తరు. ఏమని అంటే 'ఏరుగ పోయేప్పుడు ఎల్కకాయ తింటావుర తింటావురా అంటవా? అద్దుక తింట ఏం చేస్తవు?' అన్నడట. ఏరుగ అంటే ఈ కాలం తరంకు తెల్వకపోవచ్చు. మల విసర్జనంకు అన్నట్టు. ఆనాటి కాలంలో బహిరంగంగా కానిస్తుండేవాల్లు. అప్పుడు ఎలక్కాయ అంటే వెలగకాయ తినవద్దుర పనిపూర్తి అయినంక తినవచ్చు కదా అంటే, ఇందులోనే అద్దుకుని తింటా అంటే ఏం చేస్తరు? ఏం చెయ్యరు. వాడు పెడసరి అనుకుంటరు.
కొందరు ఎంత వుండాలనో అంతే వుంటరు. వాల్లు పద్ధతిని బట్టి మెదులుతరు. వీల్లు 'మంచం ఉన్నంతలనే కాళ్ళు చాపుకోవాలె' అనే రకం. అంటే ఎంత వుంటే అంతనే అన్నట్లు. వీల్లే 'ఎంత చెట్టుకు అంత గాలి' టైపుల జీవిస్తరు. అట్లనే సేమ్ ఇట్లనే వాడు 'ఉన్నంతలనే కాళ్ళు సాపుకుంటడు' అని కూడా అంటరు. ఇట్లాంటి వాల్లు బడాయికి ఎక్కువ పోరు. తమ పని తాము చేసుకుంట ఎక్కువ కనపడరు, వినపడరు. లేకుంటే ఎట్లపడితే అట్ల మెదిలేటోల్లను చూసి దుర్మార్గులు 'ఆయమెరిగి గాయం చేస్తరు' అంటే మనతో స్నేహం చేసినట్లు నటించి, లోగుట్లు తెల్సుకొని ఏదో మోసం చేస్తరు అన్నట్లు. ఈ విషయంలో స్త్రీలను 'ఆడోల్ల మర్మం తెల్సుడు కష్టం' అంటరు. మర్మం అంటే అంతరం. లోపలి మాటల ఆలోచనలు, వ్యూహాలు. పురుషులకన్నా స్త్రీలు కొంత పరిణితితో కన్పిస్తరు. మగవాల్లు అయితే గలగల మాట్లాడుతరు. అదే మహిళలైతే తక్కువ మాట్లాడుతరు. అంటే తెల్వదని కాదు, అన్నీ తెలుసు, తెలిసినట్టు కన్పించరు. ఈ నిర్ణయాలు అందరికీ అన్ని చోట్ల కచ్ఛితం అని కాదు గాని జనంలోని ఉవాచ.
- అన్నవరం దేవేందర్,
9440763479