Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చైతన్య బావుట' అంటూ డా|| కొండపల్లి నీహారిణి చక్కటి ముందుమాట రాశారు. 75 సం|| భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది కవయిత్రులతో వంశీ ఆర్ట్స్ థియేటర్స్ వెలువరించిన చక్కటి కవితా సంకలనం ఇది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే గాక, అమెరికా, ఖతార్, మలేషియా, మస్కట్, సింగపూర్ లాంటి చోట్ల వున్న ప్రవాసాంధ్ర కవయిత్రుల కవితలు అద్భుతంగా వున్నాయి. అన్ని కవితలూ సమీక్షించదగినవే అయినా స్థలాభావంతో కొన్ని కవితలు చూద్దాం.
''బానిసత్వపు సంకెళ్ళను తెంచుకుని/ స్వేచ్ఛాపావురమై గగనాన విహరిస్తూ/ వజ్రోత్సవ వేడుకల వైభవాన్ని చాటగా/ ఎగురుతోంది ఇంటింటా! మువ్వన్నెల మన జెండా'' (పేజీ.17) అంటారు అనుశ్రీ గౌరోజు తన 'ఇంటింటా వేడుక' కవితలో. ''ఈ భరత భూమి ఎన్నో మతాల, భాషల, రీతుల సౌరభ మాలిక/ అందరినీ ఆదరించే అనురాగ కల్పవల్లిక'' అంటారు ఆముక్త మాల్యద తిరుమల (పేజీ. 21) 'నా మాతృభూమి' కవితలో.
''డెబ్బై ఐదేళ్ళలో సాధించినదెంతో... కానీ ఆగేది లేదు కొంతైనా/ అందరమొకటై సాధించిన స్వాతంత్య్రాన్ని నిలుపుకుందాం!'' అంటారు ఉమాదేవి ఇల్లెందుల. ''త్రివర్ణమంటే - మకర సంక్రాంతి - బతుకమ్మకి - ముస్తాబయ్యే - పొంగలి కుండకి తెలుసు - జీవితమంతా - జీవనమంతా - త్రివర్ణమయమైన - వజ్రోత్సవ వేడుక నాడు జ్ఞాపకాలతో ఎటు చూసినా త్రివర్ణ పతాక కాంతులే'' అంటారు డా||గీత.
''చంద్ర గ్రహణం రోజున పూజలు - స్నానాలు చేసే/ మన దేశం 'చంద్రయాన్' చేపట్టింది. కామన్ మేన్‌గా కామన్వెల్త్లోను - ఒలంపిక్స్‌లోనూ/ మన పతాకాన్ని, కీర్తిని పతాక స్థాయిలో నిలబెట్టింది'' అన్నారు గౌరి పార్వతీదేవి బొమ్మన (పేజీ. 37). ''వజ్ర సంకల్పాలెన్నిటినో నెరవేర్చుకుని/ వజ్రభారతిగ వెలుగొందిన/ ఓ దేశమా! నీకు జోహార్లు!'' అంటారు పొత్తూరి జయలక్ష్మి (పేజీ.38).
''జన సంక్షేమమే జగతి సంక్షేమమని అమృతోత్సవాల పరిమళిస్తోంది'' అంటారు జ్వలిత దెంచనాల (పేజీ 44). ''హృదయం శాంతికపోతంగా మారాలి/ దేహం పరోపకార గుణం ధరించాలి!'' అన్నారు డా||త్రివేణి (పేజి 45). ''వజ్ర సంకల్పాన్ని నెరవేర్చడానికి/ ధర్మ సంస్థాపన చేసే దేవుడో/ మానవ రూపేణ భగవంతుడో/ జన్మించాలని ఆశిస్తూ'' జైభారత్ (పేజీ.50) అ ంటారు దేవకీదేవి తిరునగరి. ''దేశమే నీ ఇల్లనుకుని/ ఇంటి రక్షణకై కాపు కాస్తున్నావు/ నీ త్యాగం ప్రతి గుండెను కదిలించే చైతన్యం'' అంటారు సలాం సైనికుడా కవితలో వసంత లక్ష్మణ్ (పేజీ.109).
మనిషి, మానవత, సాంకేతికాభివృద్ధి, రైతు, యువత, దేశభక్తి, దైవభక్తి, దేశం కీర్తి, నేతల త్యాగాలు, జెండా పండుగ, శాంతి సౌభాగ్యాలు, ఉన్నత విలువలు... వస్తువుగా ఎంతో విలువైన కవితలున్న మంచి సంకలనం. 'వంశీ ఆర్ట్స్ థియేటర్స్‌కు, తెన్నేటి సుధాదేవి, జ్యోతి గారల కృషి అభినందనీయం.
వజ్రోత్సవ భారతి
సంకలన కర్తలు : డా||తెన్నేటి సుధాదేవి, జ్యోతి వలబోజు
పేజీలు : 160, వెల : 150/-
ప్రతులకు : వంశీ ఆర్ట్ థియేటర్స్, ఇం.నెం.2-1-527/5
నల్లకుంట, హైదరాబాద్- 500044.
ఫోన్ : 9849023852
- తంగిరాల చక్రవర్తి , 9393804472