Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడున్నర దశాబ్దాల బోధనానుభవం, నిత్య చైతన్యశీలత, ఆరున్నర పదుల వయసులోనూ అలుపెరుగక చేసే రచనలు ఆయనకే చెల్లు. ఆయనలాగే ఆయన కృతుల పేర్లు చిత్రంగా ఉంటాయి. ఆయన కవి, రచయిత, బాల సాహితీవేత్త, వేలాది సామెతలు, సూక్తుల సేకర్త, విశ్రాంత ఉపాధ్యాయులు, బాల సాహితీవేత్త సిరిగాద శంకర్. కలంపేరు 'సూర్యశ్రీ'. సెప్టెంబర్ 4, 1947న నేటి కామారెడ్డి జిల్లా బీబీపేటలో పుట్టారు. తల్లితండ్రులు శ్రీమతి బాలమ్మ-శ్రీ నర్సయ్యలు. ఎం.ఎ. ఎం.ఎడ్ చదివి ఉపాధ్యాయ వృత్తిలో మూడున్నర దశాబ్దాలు సేవలందించిన సిరిగాద శంకర్ రచన, సంపాదకత్వంలో ముప్పైకి పైగా రచనలు వచ్చాయి.
వచన కవిత్వం, కథలు, నవలలు, బాల సాహిత్యం, స్థల పురాణాలు, శాస్త్రసాంకేతికాంశాలకు సంబంధించిన రచనలు, ఉయ్యాల పాటలు, ఆధ్యాత్మిక రచనలు, ఉద్యోగ సోపానాల పుస్తకాలు, జీవిత చరిత్రలు, స్త్రీల సాహిత్యం వంటి ప్రక్రియలు, రూపాల్లో వీరి గ్రంథాలు అచ్చయినాయి. ఇవేకాక కొన్ని సంకలనాలు కూడా ప్రచురించారు. పైన చెప్పినట్టు ఈయన పుస్తకాల పేర్లు చాలా చిత్రంగా ఉండడం విశేషం. 'పో', 'పద', 'రా', 'లే' వీరి వచన కవితా సంపుటాలు. కథా సంపుటాలు, నవలలు కూడా ప్రచురించారు సిరిగాద. వాటిలో 'ఆడపిల్లేనా?', 'ప్లీజ్ తాళి తెంపకు', 'స్వేచ్ఛా విహంగాలు', 'ప్లీజ్ మా నాన్నను పెళ్ళి చేసుకొండి' వంటివి ఉన్నాయి. 'కూడెల్లి రామశ్వరం' దేవాలయ కథను స్థల పురాణాన్ని పుస్తకంగా తెచ్చారు. తెలంగాణ నేపథ్యంగా 'గాంధారి బాలరాజు కథ', 'తెలంగాణ తల్లి' వీరి ఉయ్యాల పాటలు. రచయితగానే కాక ఆధ్యాత్మిక పుస్తకాల రచయితగా కూడా సిరిగాద ప్రసిద్ధులు. 'భగవద్గీత ఎందుకు చదవాలి?' పుస్తకం వీరికి గుర్తింపును తెచ్చింది. ఇవేకాక 'భగవద్గీత తందాన', 'ఆధ్యాత్మిక నిధి-3 భాగాలు', 'వివాహము' ఇతర రచనలు.
ఉద్యోగసోపానాలు పేర సిరిగాద కూర్చిన రచనలు కూడా వీరికి పేరును తెచ్చిపెట్టాయి. వాటిలో 'మన ప్రణాళికలు', 'నీతి ఆయోగ్', 'తెలంగాణ సంస్కృతి-సాహిత్యం', 'భారత రాజ్యాంగం', 'మన ఓటు' వంటివి ఉన్నాయి. ఇక్కడ 'మన ఓటు' గురించి చెప్పుకోవాలి. ఇది సిరిగాదకు జాతీయ స్థాయిలో గుర్తింపు నివ్వడమేకాక ఆంగ్లంలోకి వస్తోంది. 'గోదాదేవి' జీవిత కథతో పాటు 'ఆరు సూత్రాలు పాటిస్తే అందరూ విజేతలే', 'శ్రీశ్రీ జీవన రేఖలు', 'జాషువా జీవన రేఖలు' పుస్తకాలు తెచ్చారు. ఇటీవల వీరు చేసిన పెద్దపనుల్లో ఒకటి 'గోల్డెన్ వర్డ్స్' 'పెద్దల మాటలు' పేరుతో తెలుగు ఆంగ్లాల్లో తెచ్చిన వేలాది సామెతలు, సూక్తుల పుస్తకాలు. వేయి పుటలకు తగ్గని ఈ పుస్తకాలు డెబ్బైఐదేండ్ల వయస్సులోనూ అలుపెరుగని దీక్షని తెలుపుతాయి. 'తొలి' పేరుతో తెలుగు భాష గురించి కూడా ఒక రచన చేసిన సిరిగాద '1900-1950 పేరు ఎన్నికగన్న కవుల జీవన రేఖలు' వంటివి రాశారు.
కార్యకర్త, కావ్యకర్తగానే కాక బాల సాహితీవేత్తగానూ సిరిగాద శంకర్ ప్రసిద్దులు. 'పాప', 'ఎందుకు-2' వీరి బాల సాహిత్య రచనలు. ఇవేకాక శాస్త్ర, సాంకేతికాంశాలతో కూడిన వీరి రచనలు 'ఎందుకు', 'ఎందుకు-1' వంటివి పిల్లల్లో జిజ్ఞాసను పెంచే రచనలు. రాష్ట్ర ఉపాధ్యాయ పురస్కారంతో పాటు వండర్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వంటి వివిధ పురస్కారాలు సిరిగాదను వరించాయి. 'వానా వానా రావమ్మా/ వచ్చీ మాతో ఆడమ్మ/ చెరువలన్నీ నింపమ్మా/ కడుపు నింపి పోవమ్మ' అంటూ వానను ఆడుకొమ్మని ఆహ్వానించిన కవి, పిల్లల్లో ఆసక్తిని పెంచుతూ వివిధ వృతుల అవగాహన బాలలకు కలిగేందుకు 'కుండలు చేసే దెవరురా?.../ కర్రులు చేసేదెవరురా?.../ పట్టు బట్టలు నేసే దెవరురా?...' అంటూ ప్రశ్నలు వేసి, అటువెనుకే వాళ్ళ అవగాహన కోసం సమాధానాలు చెప్పి ఆసక్తి కలిగించేలా రాస్తారు. 'ఉడుతా! ఉడుతా! ఉడుతా!', 'వీరి 'పాప' గేయ సంపుటిలోని గేయాలు పిల్లలకు నచ్చడమే కాక చైతన్యాన్ని కలిగిస్తాయి. 'పచ్చని చెట్లను కొట్టొద్దు/ పండ్లు ఫలాలకు దూరం కావద్దు/ పచ్చని చెట్లను కొట్టొద్దు/ చల్లగాలులకు దూరం కావద్దు / పచ్చని చెట్లు కొట్టొద్దు/ వర్షాలకు దూరం కావద్దు/ పచ్చని చెట్లు కొట్టొద్దు నేల కోతకు కారణం కావద్దు/ పచ్చని చెట్లు కొట్టొద్దు/ వేడి గాల్పులకు మాడి చావద్దు' అంటూ రాస్తారు సిరిగాద. బహుశ, ఇంతకంటే అరటి పండు ఒలిచి పెట్టినట్టు తన మనవలు, మనవరాండ్లవంటి బాలబాలికలకు చెప్పడం ఈ తాతకు బాగా తెలుసు. పిల్లల మనసు తెలిసిన ఉపాధ్యాయుడు, తండ్రి, తాత కదా! ఈ గేయం చూస్తే అది తెలుస్తుంది. 'మా కిష్టం, మాకిష్టం/ అల్లరి అంటే మాకిష్టం/ ఆటలంటే మాకిష్టం/ అమ్మా నాన్న అంటే/ మాకిష్టం' అంటూ రాస్తారు. వైజ్ఞానిక, భౌతికవాదం పట్ల ఆయనకు ఎంత నమ్మకమో ఆధ్యాత్మిక భావన అంతేవుంది. ఈ రెండూ ఆయన బాల సాహిత్యంలోనూ, ఇతర రచనల్లోనూ కనిపిస్తాయి. 'భారతదేశం మనదిరా / బంగారు భూమి మనదిరా/ మతాలు ఎన్నైనా బోధించేది/ సత్యం, శివం, సుందరం' అన్నది వీరి మతం. అమృతోత్సవ జన్మదినం జరుపుకున్న సిరిగాద కవి నిండు నూరేళ్ళు వర్దిల్లాలి. శతమానం భవతి, జయహో! బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548