Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊరిసామెతలు
లోకం మీద అత్త కోడండ్ల కిరికిరి తక్కువదేమి కాదు. అత్త అంటే ఆదిపత్యంను కోడలు కొంతకాలం భరించుడే వుంటది. అత్తాకోడండ్లు కొన్ని ఇండ్లడ్ల బహిరంగంగనే కొట్లాడుకుంటరు. మరికొన్నిండ్లల్ల లోలోపల మనసుల మసులుకుంటరు. ఇసొంటి కత చూసి ఆమె 'అత్తను అమ్ముకొమ్మంటది కోడలును కొలుసుకొమ్మంటది' అంటరు. పూర్వకాలం పైసలు చేతిలో వుండేవి కావు. ఇంటి ముందటికి ఏదన్న వస్తే కొనుక్కోవాలంటే ఇంట్ల వడ్లు, జొన్నలు వాల్లకి అమ్మి కొనుక్కునేవాల్లు. అయితే కోడలు చూడనప్పుడు వడ్లు అమ్ముకునేట్టు ప్రోత్సహించిన పక్కింటి ఆమె, తిరిగి అత్త లేనప్పుడు కోడలును మీ ఇంట్ల వడ్లు కొలువు ఎన్ని వున్నాయో అని అనుమానాలు చెప్పేది. అంటే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి ఆమె ఆనందపడేది.
ఎంతైనా 'అత్త లేని కోడలు ఉత్తమురాలు' అంటరు. ఎందుకంటే ఏ లొల్లి ఉండది, పెత్తనం వుండది. అట్లనే 'కోడలు లేని అత్త గుణవంతురాలు' అనే మాట కూడా అంటరు. అయితే ఈ కాలానికి అత్తాకోడండ్లు కల్సి ఎవలు వుంటుండ్రు గని, ఎన్కట తండ్రీ కొడుకులు ఒకే కులవృత్తి గలవాల్లు అయితే ఒకటే ఇంట్ల వుండి ఇట్ల తగదిం తగదిం లొల్లులు వుండేటివి. అత్తలు కూడా వాల్ల అత్తల ఆరల్లు అనుభవించే వాల్లు. తిరిగి వాల్లు ఆ పరంపర కొనసాగించాలనుకుంటరు. అందుకే కోడండ్లు 'అత్తవారింటి ఐశ్వర్యం కన్నా పుట్టింటి గంజి మేలు' అనుకుంటరు. ఇట్ల అత్తాకోడండ్ల మధ్య కలహం సుర్వు అయితే కొడుకుల పని పరేషానే వుంటది. బ్యాలెన్స్ చెయ్యలేక బ్యాలెన్స్ కోల్పోతరు.
కొన్ని సందర్భాలలో 'అత్త పెట్టే ఆరల్లు కనపడుతయి కానీ కోడలు పెట్టే కొంటె పనులు కనపడవు' అంటరు. కొంతమంది కోడండ్లు చిచ్చు ఎక్కన్నో ఏర్పడకుంట పెడుతరు. పెట్టి ఏర్పడకుంట మొకం పెడతరు. ఇసొంటి అత్తలు కోడండ్ల దగ్గర జాగ్రత్తగనే వుంటరు. ఎంతైనా 'అత్త అత్తే కోడలు కోడలే'. కొన్ని సామెతలు జండర్ నింద పూర్వకంగానే చలామణి అవుతయి. 'రెండు సిగలు కల్సి వుండయి' అని కూడా అంటరు. స్త్రీలందరు సమైక్యంగ వుండరనే అర్ధంలో వాడుతరు కానీ వాల్లు కల్సే వుంటరు. కొన్ని కొన్ని బంధాల మధ్య అత్తాకోడండ్లు, యారండ్లు వదినే లేక మరదలు ఆడబిడ్డలు ఇట్లా కొన్ని బంధాలు సెన్సివిటితో వుంటయి. గౌరవాలు, ప్రేమలు ఇచ్చి పుచ్చుకుంటే సంసారం పచ్చగ కొనసాగుతది. కోపాలు మనిషి మీద చూపించక వస్తువుల మీద చూసిస్తారు. 'అత్తమీది కోపం దుత్త మీద చూపించినట్లు' అంటరు. అత్త వేదింపులు భరించక ఇంట్ల కుండలు కడుక్కుంట పగులకొట్టి జారిపోయింది అని అంటరు.. కోపం ఎక్కన్నుంచో వెల్లిపోవాలి గద. అందుకే అట్ల.
- అన్నవరం దేవేందర్, 9440763479