Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలను ఆకర్షించేవి, కదలకుండా కూర్చోబెట్టేవి కథలు. అలాంటి కథల పుస్తకం పట్టుకోని పిల్లలు ఉంటారా? సరిగ్గా అలాంటి పుస్తకమే 'కార్వేటి నగరం కథలు'. ఆర్.సి.కృష్ణస్వామిరాజు రాసిన ఈ పుస్తకం ముఖచిత్రం చూడగానే చదవాలనిపించేలా ఉంటుంది. ఇందులో ప్రతీకథను అందమైన భాష, ప్రాంతీయ యాసతో తీర్చిదిద్దారు రచయిత. కథలో చెప్పిన నీతిలో కూడా ప్రత్యేక శైలి చూపించారు. సాంకేతిక యుగంలో సంక్షిప్త సంబోధనలకు, సందేశాలకు అలవాటు పడ్డ పిల్లలకు ప్రతీ కథలోనూ సందర్భానుసారంగా సామెతల రుచి చూపించారు. కొత్త కొత్త సామెతలు నేర్చుకోవడానికైనా కథను రెండోసారి చదువుతాం. అలా చదివింపజేయడంలోనే రచయిత నేర్పు కనపడుతోంది.
'గంట ఎవరు కొడతారు?' అనే కథ పిల్లలకు బాగా నచ్చుతుంది. పక్షులకే కాదు పిల్లలకు స్వేచ్ఛ అవసరమని 'గగన విహారం' కథ ద్వారా చెప్పకనే చెప్పారు. అన్నిటినీ ఎలా అని ప్రశ్నించే కుతూహలం కలిగిన పిల్లలకు 'ఊరు పేరు' కథ బాగా నచ్చుతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతనే కథకు పేరుగా పెట్టి కథను మలిచిన తీరు అద్భుతం. నేటి పరుగుల ప్రపంచంలో పోటీతో పాటు ప్రణాళిక ప్రకారం పిల్లలకు నేర్పుతూ, వారికి తగినంత సమయం ఇవ్వడం ఎంత అవసరమో 'నడిచే బిడ్డలు పుట్టరు కదా' అనే కథ తల్లితండ్రులకు మంచి సందేశాన్నిస్తుంది. అలాగే 'రోగానికి సేవ, జింకల వనం' కూడా మంచి కథలు. అతి గారాబం ఎంత ప్రమాదమో తల్లితండ్రులకు చెప్తూ, తప్పులను సరిదిద్దుకోవడం అంతే అవసరమని పిల్లలకు చెప్పే కథ 'పొగరుబోతు కుక్కపిల్ల'. మిగిలిన కథలు కూడా ఆసక్తిగా చదివిస్తాయి.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథ 'అన్నం మెతుకు'. అవసరమే ఆవిష్కరణలకు మూలం అని గొప్ప విషయాన్ని చెబుతూ సాగే కథ. అలాగే మానవ సంబంధాలు ఎంత ముఖ్యమో చెప్పే కథ ''పలుకే బంగారం'. ప్రస్తుత తరానికి అవసరమైన కథ ఇది. ఇంచునించు అన్ని కథల్లోనూ కార్వేటి నగరాన్ని, చుట్టుపక్కల ఊర్లను ప్రస్తావించడం ద్వారా రచయితకు కన్నతల్లి వంటి ఊరు మీద ఎంత ప్రేమో తెలుస్తుంది. పుస్తకంలోని అన్ని కథలు ఆసక్తిగా చదివించే తీరులో రాయడం రచయితకు భాష మీద పట్టుతో పాటు మంచి కథలు అందివ్వాలనే తపన ఎంత ఉందో తెలుపుతుంది. అందువలనే ఈ పుస్తకంలోని కథలన్నీ ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. వేసవి సెలవులలో పిల్లలకు పెట్టే మంచి తాయిలం ఈ 'కార్వేటి నగరం కథలు'.
- డా||హారిక చెరుకుపల్లి, 9000559913
కార్వేటి నగరం కథలు, పేజీలు :108, ధర :140/-, రచయిత చిరునామా :ఆర్. సి.కృష్ణస్వామి రాజు, 22-4-71, బ్యాంకు ఎంప్లాయిస్ కాలనీ, మంగళం రోడ్డు, తిరుపతి - 517507 (ఫోన్ :9393662821)