Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇవ్వాళ్ళ తెలుగునాట బాల సాహిత్య రచనోద్యమంతో పాటు వికాసోద్యమం గొప్పగా జరుగుతోంది. బాలల కోసం జరుపుతున్న సృజనాత్మక శిల్పశాలలు చక్కని పాత్రను పోషిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వందలాది మంది సృజన శిల్పశాలలు నిర్వహిస్తున్నారు. అందులోనూ ఖమ్మం ఇటీవల గుమ్మంగా నిలిచింది. అనేక మంది పిల్లల కోసం పనిచేస్తూ, వారి రచనలను అచ్చు రూపంలో తెస్తున్నారు. వారిలో అటు వికాసోద్యమంలో, ఇటు రచనలో రాణిస్తున్నవారిలో ఖమ్మంకు చెందిన సయ్యద్ షఫీ ఒకరు.
మాతృభాష ఉర్దూ అయినా తెలుగు తనకు 'మెతుకు' భాష అని చెప్పుకునే షఫీ ఏప్రిల్ 4, 1967న పుట్టారు. శ్రీమతి రంజాన్ బీ-శ్రీ జానీమియా వీరి తల్లితండ్రులు. స్వగ్రామం ముష్టికుంట్లతో పాటు నాగులవంచ, ఖమ్మం, మహబూబ్ నగర్లలో విద్యాభ్యాసం చేశారు. తెలుగులో ఎం.ఎ తెలుగు చదివి ప్రస్తుతం తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా ఖమ్మం లోని రిక్కా బజార్ హై స్కూల్లో సేవలందిస్తున్నారు. తాను పనిచేసిన ప్రతీచోట తనదైన ముద్రతో నిలిచి వెలిగే ఈద్ కా చాంద్ లాంటి వాడు ఈ రంజాన్ బీ కొడుకు. అందుకు ఆయన పనిచేసిన చోట జరిగిన లేదా షఫీ జరిపిన పండుగలే ఉదాహరణ. విద్యార్థులతో కరపత్రాలు రాయించి గడప గడపకు బడిని మోసుకు తిరగడం, సెలవురోజుల్లోనూ ప్రత్యేకంగా పిల్లలతో పనిచేయడం, పాఠశాలలో వివిధ ఉత్సవాలతో పాటు బడి వార్షికోత్సవాలు జరపడం వాటిలో కొన్ని. ఎన్.పి.ఈ.జి.ఈ.ఎల్ కో ఆర్డినేటర్‌గానూ సయ్యద్ షఫీ బాలికల కోసం చేసిన పలు కార్యక్రమాలు చక్కని ఫలితాల నివ్వడమేకాక ఎందరో బాలికలు ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి ఉత్తీర్ణత సాధించడానికి తోడ్పడి దారి దివ్వెగా నిలిచాడు. అలా పది పాసైన అనేక మంది యివ్వాళ్ళ వివిధ ఉద్యోగాల్లో స్థిరపడడం గొప్ప విషయం. షఫీ కోవిడ్ కాలంలో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన 'కథలు రాయడం ఎలా?' కార్యక్రమం ఎందరో బడి కథకులను తయారు చేసింది.
1988లో డిగ్రీ విద్యార్థిగా షఫీ రాసిన తొలి కథ 'కళ్ళు తెరవాలి' పేర ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం అయ్యింది. తరువాత కొత్త గూడెం, హైదారాబాద్ ఇతర కేంద్రాల ద్వారా 18 కథానికలు ప్రసారం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆయన పాల్గొన్న కొన్ని కార్యక్రమాల్లో పిల్లలు కథల పుస్తకాలు చదవడం పట్ల ఆకర్షితులు కావడం చూసి తాను పిల్లల కోసం రాయడం ప్రారంభించారు. దీనికి తోడు అప్పటికే తెలంగాణలో ఉద్యమస్థాయిలో జరుగుతున్న బాలల రచనా వికాసోద్యమం ప్రభావం కూడా బహుశ వీరిపై పరోక్షంగా ఉండొచ్చు. 2018లో మూడుసార్లు పిల్లలకు కార్యశాలలు నిర్వహించి అందులో రాసిన కథలను 'బడి పిల్లలు-భలే కథలు' పేరుతో అచ్చువేశారు. ఈ సంకలనానికి డా.చింతోజు బ్రహ్మయ్య-బాలమణి తొలి బాల పురస్కారాల్లో ఒకటి లభించింది. ఈ పురస్కారం అందించిన స్ఫూర్తితో మళ్ళీ 2019లో 'బాల కథలు జిందాబాద్' పేరుతో మరో బాలల కథా సంకలనం తెచ్చారు. యిదే కోవలో మరికొన్ని బాలల పుస్తకాలు తెచ్చారు సయ్యద్ షఫీ. వాటిలో 2022లో వచ్చిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిక్కాబజార్ విద్యార్థుల పుస్తకం 'సోపతిగాళ్ళ స్వగతాలు', ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల విద్యార్థుల కవితలతో తెచ్చిన 'సుగంధి' సంకలనం, యిటీవల వచ్చిన ఖమ్మం విద్యార్థుల కథా సంకలనం 'ఖమ్మం జిల్లా కథల పల్లకి' వంటివి ఉన్నాయి. ఈ వికాస కార్యక్రమాలు ఖమ్మం కేంద్రంగా నిర్వహిస్తున్న వారిలో షఫీ ప్రథములు కాదు, అక్కడి నుండి డజనుకు పైగా వికాసకారులు ఈ పవిత్రకార్యం చేస్తున్నారు. బాల వికాసకారుల పరిచయంలో వాళ్ళ గురించి రాస్తాను.
స్వయంగా కవి, రయిచిత అయిన సయ్యద్ షఫీ ఆకాశవాణి కోసం కథలేకాక బాలవాణి కోసం బాలల కథలు, కవితలు, గేయాలు రాసి ప్రచురించి వాటిని పిల్లలకు కానుకగా అందించారు. పిల్లలకోసం వచ్చిన వీరి తొలి రచన 'కథలండోరు.. కథలు' బాలల కథా సంపుటి. దీనిని ముద్రించడమే కాక స్వయంగా తన చుట్టుపక్కలున్న మూడు మండలాల్లో ప్రతి బడికి అందించాడు. ఈ కోవలోనే పిల్లల కోసం రాసిన మరో కథా సంపుటి 'గగనంలో గాలి పటం'. యిందులోని కథలు పిల్లల మనస్తత్వాలకు అద్దం పట్టేవే కాక వాళ్ళకు నచ్చే కథలు. అందుకు షఫీ ఎన్నుకున్న రచనా విధానం, వస్తువు వంటివి ప్రధాన కారణం. పిల్లల కోసం ఈ బడి కతల సారు తెచ్చిన మరో కవితల పుస్తకం 'ఎలనీరు'. బాలల కోసం షఫీ రాసిన కథ బాల చెలిమి ప్రచురించిన బాలల కథా సంకలనంలో అచ్చువడమే కాక వివిధ కార్యశాలలు, సమ్మేళనాల్లో పాల్గొని వివిధ అంశాలపై తన అభిప్రాయాలను అందించారు. తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతిష్టాత్మకంగా బాలల కోసం నిర్వహించిన 'మన ఊరు-మన చెట్టు' కార్యక్రమంలో ముందు వరుసలో నిలుచుని పనిచేశారు. 'బాల సాహిత్యమే దేశ భవిషత్తు' అని బలంగా నమ్మే ఈ బడి కతల సారు పుట్టిన రోజు ఏప్రిల్ 8 సందర్భంగా సాల్గిరా ముబారక్‌బాద్.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548