Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు 'పైసామే పరమాత్మ' టైపు వుంటరు. అన్నిటినీ ఆర్థిక బంధంతోనే చూస్తుంటరు. వాల్లు పైకి మంచిగ కన్పిస్తరు. ఏదో మర్యాద చేసినట్టు ఎక్కువ గడబిడ చేస్తరు గానీ లోపల ప్రేమ వుండది. వాల్లను 'పెట్టి పొయ్యకున్న పెయ్యంతా పునికి చూసినట్టు' చేస్తరు అంటారు. పెట్టి పొయ్యకున్నా అంటే ఇంటికి వచ్చిన వాల్లకి ఆహారం పెట్టకున్నా, చాయ పాలు నీళ్ళు పొయ్యకున్నా, పెయ్యంత పట్టుకుని... ఎప్పుడచ్చినవు బిడ్డా అని, అంత మంచే గదా అని పునికి పునికి చూస్తరు అన్నట్టు. పెయ్యి అంటే దేహం అని అర్థం. వీల్లకు నటన ఎక్కువ, ప్రేమ తక్కువ. అట్లనే వీల్ల టైపు ఎట్లుంటదంటే 'మా ఇంటికి వస్తే ఏం తెస్తవు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తవు' అన్నట్టు వుంటది. వీల్లకు 'పైస పోతే పాణం పోతది' అనే సామెత కూడా వర్తిస్తుంది. వీల్ల మాటలను 'బెల్లాల మాటలు' మాట్లాడతరు అని అంటరు. అందరు ఇట్ల వుంటరని కాదు గానీ లోకం మీద రకరకాల మనుషులు, రకరకాల ఆలోచనలు. కొందరైతే బిందాస్గ జీవిస్తరు. పైసలున్నా లేకున్నా జీవితాన్ని ఆనందంగా జీవిస్తరు. మరి కొందరేమో 'వాల్లది ఏమో ఎత్తుక పోయినట్టు' మొకం పెడతరు. ఇసోంటోల్లు పిసినాసి ఏశం ఏశి దాసిపెడితే ఏమైతది? 'పాసు పండ్లోడు దాశి పెడితే బంగారు పండ్లోడు తింటడ'నే సామెత కూడా వున్నది. అట్లనే 'దాశి దాశి దయ్యాల పాలు చేసుకున్నడు' అని కూడా అంటరు. వాల్లు సంపాదించిందే వాల్లు తినరు, తాగరు. అట్లనే సంపాదన కుప్పలు కుప్పలు చేస్తరు. సుఖపడరు. కష్టపడతనే వుంటరు. అంతల ఒకనాడు గుండె స్విచ్ఛాఫ్ అయితే ఇంతే సంగతులు. 'ఇత్తునం ఒకటి పెడితే చెట్టు ఒకటి మొలుస్తదా?'. అయ్య తాతలు ఎట్లున్నరో, కొడుకులు మనుమలు ఆల్లనే వారసత్వం తెచ్చుకుంటరు. ఎవరేం చేస్తరు? జరిగేదే జరుగుతది అని మనందరం చూసి ఊరుకునుడే కద.
- అన్నవరం దేవేందర్,
9440763479