Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరీంనగర్ వాస్తవ్యులు, ప్రముఖ కవి, రచయిత, సీనియర్ న్యాయవాది గులాబీల మల్లారెడ్డి రాసిన అయిదు తరాల తమ వంశీకుల చరిత్రే ఈ ఐదు తరాలు కథా సంపుటి. దొరలు, భూస్వాములు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, అసువులు బాసిన తమ వంశీకుల చరిత్రను కళ్ళకు కట్టినట్లు ఉత్తర తెలంగాణ యాసలో అక్షరీకరించారు.
నేపధ్యం : 1905 దశకంలో ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రం ఎలగందుల. కరీంనగర్ పేరు అప్పట్లో అలపిరాల. ఆ తరువాత రోజుల్లో నిజాం ప్రభుత్వ ప్రతినిధిగా, కరీం అలపిరాలకు ప్రాతినిధ్యం వహించేవాడు. ఎలగందుల నుంచి అలపిరాలకు జిల్లా కేంద్రాన్ని మార్చి, కరీంనగర్ అనీ తన పేరు పెట్టుకున్నాడు. 1905లో దశకంలో అక్కడి భౌగోళికస్థితి, ప్రజల జీవన విధానం, నిజాం ప్రభుత్వ అండతో ఆయా ప్రాంతాల్లో దొరలు, భూస్వాములు, ప్రజలపై చేసిన అకత్యాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, పన్నుల పేరుతో ప్రజలను హింసించడాలు, ఆడవాళ్ళపై చేసిన లైంగిక దాడులు అనేకం.
హరిజనులు, గిరిజనులు, తెలుగోళ్ళు కాపోళ్ళు, కుమ్మరి, వడ్డరి, వడ్ల, కంసాలి, కోమట్లు, బాపనోళ్ళు, వెలమోళ్ళు, తురకోళ్ళు అక్కడ నివాసముండేవాళ్ళు. ఆ రోజుల్లో హరిజనులు రోజు కూలికి పోతే రెండు పైసలు ఇచ్చేవారు. పైసకు కావిడి మోత తెల్ల కల్లు దొరికేది.
దొరల ఇళ్ళల్లో పనిచేసే పాలేర్లకు నాలుగు కుంచాల జొన్నలు నెల జీతం. పుట్టికి తూమెడు వడ్లు ఇచ్చేవారు. వాటితోనే ఇంట్లో ఉండే వాళ్ళంతా తినాలి. అందులోనే పెండ్లిల్లు, పేరంటాలు చేయాలి. మధ్యమధ్యన చుట్టపోళ్ళు వస్తే వాళ్ళను అరుసుకోవాలి. ఇదీ అప్పట్లో గ్రామాల్లో పరిస్థితి. మరో వైపు భూమి శిస్తు వసూలు విషయంలో నిజాం ప్రభుత్వ ఉద్యోగులు ఊర్లల్లో పట్వారీలు, పోలీసు పటేల్, మాలీపటేల్ల సహాయంతో రకరకాలుగా హింసించి వసూలు చేసేవారు. ఆ హింసలు ఎలా ఉండేవంటే శిస్తు కట్టని వాళ్ళని వరుసగా వంగోబెట్టి వాళ్ళ నడుముల మీద పెద్ద పెద్ద రాళ్ళును ఉంచేవారు. చండ్రకోలతో వాతలొచ్చే వరకు కొట్టి పైశాచిక ఆనందాన్ని పొందేవాళ్ళు. మాట వినని ఆడవాళ్ళపై లైంగిక దాడులతో హింసించేవారు.
గాలపెల్లి, నరునక్కపేట జవహరు పేట, ఇల్లెంతకుంట, గన్నేరు వరం, వడ్లూరు, బేగం పేట, జవారుపేట, కాసీం పేట, మాదాపూరం, సంగెం చర్లాపురం, అల్గునూరు, అరిపిరాల (కరీంనగర్), తీగలగుట్టపల్లె, రుక్మాపురం, చొప్పదండి, కొలిమికుంట, ఆర్నకొండ, కమ్మరిఖాన్ పేట, షాకుంట, పోతారం (జె), తుర్కోని పల్లి గ్రామాలలో జరిగిన సంఘటనకు ప్రతిరూపమే ఈ ఐదు తరాలు పుస్తకం.
తరవాత రెండు కథలు మహాశక్తి సంపన్నుడు, తప్పుడు వాన. ఇవి రెండవ తరానికి చెందిన పచ్చిపాల హన్మంతుకు సంబంధించినవి. తండ్రి లక్ష్మయ్య గాలెపల్లి ఊరొదిలి వెళ్ళిపోయాక, హన్మంతు చొప్పదండిలోని తమ అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. అక్కడ మొక్క జొన్న పంటను, ఎలుగుబంట్లు నాశనం చేస్తుంటే గాయాలను లెక్కచేయకుండా, వాటిని హతమార్చాడు. అప్పటి నుంచి ఊర్లో ఆయనను మహాశక్తి సంపన్నుడు అని కొనియాడారు. అనంతరం నాయనమ్మ, తాతయ్య దగ్గరకు వచ్చిన హన్మంతు, తన మేనమామ దగ్గర చేపాలుకు కుదిరి, కాయకష్టం చేసి, అధిక పంటను పండిస్తాడు. అప్పుడే ఊర్ల గత్తర వచ్చి వంద మంది పైగా చనిపోతారు. ఊరి వాళ్ళకు పని లేదు, తినడానికి తిండి లేదు. ఆ స్థితిలో వాళ్ళను బతికించుకోవడానికి, గరిసెలో దాచి పెట్టిన ధాన్యం పంచాలని మామను అడుగుతాడు హన్మంతు. ధాన్యం పంచకపోగా అవమానిస్తాడు మామ. అంతే ఒక అర్థరాత్రి అందరూ పడుకున్నాక, హన్మంతు, ఆయన స్నేహితులు గరిసెలోని వడ్లను పేదలకు పంచారు. దొంగలు.. దొంగలు అని అరిచిన మామ నోరు మూయిస్తారు అందరు.
మూడవ తరం పచ్చిపాల మల్లారెడ్డి (మల్దాదా). జనం శిస్తు కట్టలేదని వాళ్ళ నడుములపై రాళ్ళు పెట్టి హింసిస్తున్న నిజాం ప్రభుత్వ కప్తాన్ను, వ్యతిరేకించి, తన వాళ్ళను కాపాడుకోవడమే కాకుండా కప్తాన్, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుందనీ ఒక వివాహిత మానంలో ఇసుక పోసి, దుడ్డు కర్రతో, చితకబాదిన సంఘటనటలో, ఆమెను కాపాడి, తన ఇంట్లోనే ఉంచుకొని, వైద్యం చేయించాడు. మల్ దాదా అంటే దొరలు, భూస్వాములకు భయం ఉండేది.
నాలుగవ తరం పచ్చిపాల లింగారెడ్డి (మాంధాత). మంచి ధైర్యశాలి. కులాలతో సంబంధం లేకుండా అందరితో కలిసి ఉంటూ వాళ్ళ కష్టసుఖాలలో పాలుపంచుకునేవాడు. ఆ తరువాత హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో కలపాలనీ, నిజాం ప్రభుత్వం దిగిపోవాలనీ, కమ్యూనిస్టులు, అప్పట్లో అనేక పోరాటాలు చేశారు. మరోవైపు రజాకార్లు ఊర్ల మీద పడి దోచుకోసాగారు. ఆ సమయంలో కమ్యూనిస్టులకు మాంధాత షెల్టర్ ఇచ్చి, వాళ్ళకు భోజనాలు కూడా సరఫరా చేసేవాడు. ఆ విషయం తెలిసిన పోలీసులు తనని అతి క్రూరంగా కొట్టి పడేసి పోయారు. చావు బతుకుల మధ్య ఇంట్లో చికిత్స పొందుతూ కొంత కాలానికి కోలుకున్నాడు. మాంధాత కోలుకున్న నెల రోజులకే అయిదవ తరం మల్లారెడ్డి జననం.
అయిదవ తరం పచ్చిపాల మల్లారెడ్డే ఈ పుస్తక రచయిత గులాబీల మల్లారెడ్డి. ఈయన దళిత, పీడిత వర్గాల పక్షాన నిలబడి, భూకబ్జాదారుల వ్యతిరేకంగా పోరాడి, ఒక న్యాయవాదిగా ఆయన కోర్టు రణభూమిలో యుద్దాలు చేసి, విజయాలు సాధించారు.
ఇంకా ఈ పుస్తకంలో పదహారు కథలున్నాయి. చాలా అద్భుతమైన కథలు. మనుషులు, విలువలు, సామాజిక స్పహ, భావోద్వేగాలు, కుటుంబ వ్యవస్థలు, సంస్కారం, సంస్కతి, సంప్రదాయాలు ఉన్న కథలు. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం... ఈ ఐదు తరాలు.
- ప్రమోద్ ఆవంచ, 7013272452